విజయవాడ నగరం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో నేడు నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులతో ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ఈ భారీ ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలను చేతబూని తమ దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు జాతీయ సమైక్యత, సమగ్రత స్ఫూర్తిని ఇనుమడింపజేశాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అన్నారు. "మహిళల సిందూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సిందూర్ నిరూపించింది. ఉగ్రవాదులు ఈ దేశం వైపు కన్నెత్తి చూడకుండా గట్టిగా జవాబిచ్చాం. మన సైనిక దళాల పరాక్రమాన్ని దేశ ప్రజలంతా చూశారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం" అని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ నాయక్ వంటి యువకులు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా అంతం చేయాలన్నదే ప్రధాని మోదీ సంకల్పమని, భారత్‌పై దాడి చేస్తే అదే వారికి చివరి రోజవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. దేశానికి సరైన సమయంలో మోదీ సరైన నాయకుడిగా నిలిచారని ప్రశంసించారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భారత్‌లో జరిగిన ఉగ్రదాడులన్నింటి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపించారు. "వారి దేశాన్ని వారు పాలించుకోలేక, అభివృద్ధి చెందుతున్న భారత్‌లో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విభజన జరిగినప్పటి నుంచి మనపై అనేక దాడులు జరిగాయి. మన అభివృద్ధిని చూసి పాకిస్థాన్ అసూయతో రగిలిపోతోంది" అని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ వంటి వీరులు దేశభక్తికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి కీలక సమయంలో ప్రధాని మోదీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఇది కొత్త భారతం అని పాకిస్థాన్ గ్రహించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరంగా యాత్రలో పాల్గొన్న ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
![]() |
![]() |