ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్‌స్టాలో అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా

Crime |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 11:38 PM

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఏర్పడే పరిచయాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఒకర్నొకరు చూసుకోకుండానే.. ఆన్‌లైన్‌లోనే ప్రేమించుకుంటున్నారు. ఇవి మోసాలకు, బ్లాక్‌మెయిల్ వంటి వాటికి దారి తీస్తున్నారు. కొందరు దుర్మార్గులు.. ప్రేమ పేరుతో అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. బాధితుల వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తీసుకొని వాటిని బయటపెడతామని బెదిరించి లైంగికంగా వేధిస్తున్నారు. భయంతో చాలా మంది అమ్మాయిలు ఈ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోపలే కుమిలిపోతున్నారు. తీవ్ర ఒత్తిడి, ఆందోళనతో కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు.


తాజాగా హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ పరిధిలోని ఔషాపూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అవినాష్ రెడ్డి అనే యువకుడు ప్రేమ పేరుతో ఒక మైనర్‌ అమ్మాయిని ట్రాప్ చేసి వేధించడంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మైనర్‌తో స్నేహం చేశాడు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ పలుమార్లు కలుసుకున్నారు. ఈ సమయంలో కొన్ని ప్రైవేటు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. అయితే.. కొంతకాలం తర్వాత అవినాష్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. మొదట సదరు అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిన అతడు.. ఆ తర్వాత ఆమె చెల్లెలిపై కన్నేశాడు. తనతో దిగిన ఫోటోలు, వీడియోలను చూపిస్తూ మైనర్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకువస్తే వాటిని డిలీట్ చేస్తానని నమ్మబలికాడు. భయంతో ఆ బాలిక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి రహస్యంగా బంగారు ఆభరణాలు తీసుకువచ్చి అవినాష్ రెడ్డికి ఇచ్చింది.


ఆ తర్వాత ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరింది. అయితే, అవినాష్ రెడ్డి తనలోని కామాంధుడిని నిద్రలేపాడు. నీ చెల్లిని తీసుకొస్తేనే.. వాటిని డిలీట్ చేస్తానని చెప్పాడు. దీంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురైంది. అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అవినాష్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


కాగా, ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాల వల్ల యువత ఎంత ప్రమాదంలో పడుతున్నారో తెలియజేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. వారు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. అలాగే, యువత సైతం అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం పంచుకునే ముందు జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com