భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో దాయాది పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రూ.7500 కోట్లు ప్యాకేజీ మంజూరు చేయడంపై అంతర్జాతీయంగా విస్మయం వ్యక్తమైంది. తాజాగా, పాకిస్థాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) రుణం మంజూరుపై అమెరికా సైనిక వ్యూహకర్త విమర్శలు గుప్పించారు. ట్రంప్ యంత్రాంగం పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సహయానికి మద్దతు ఇవ్వడాన్ని అమెరికా థింక్‌ట్యాంక్ అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్ సైనిక వ్యూహకర్త మైకేల్ రూబిన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేకంగా ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా పెట్టుకున్న పాకిస్తాన్‌కు అటువంటి మద్దతు అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌కు నిధులు అందించడం ద్వారా IMF పరోక్షంగా చైనాకూ ఆర్థికంగా మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం చైనా చెప్పుచేతల్లో ఉన్న పాక్ గ్వాదర్ పోర్టును అప్పగించింది.. చైనా–పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ వల్ల పాక్ ఇప్పటికే 40 బిలియన్ అమెరికా డాలర్ల లోటులో ఉంది’ అని రూబిన్ పేర్కొన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల పరిమిత యుద్ధంలో భారత్ విజయం సాధించిందని మైకేల్ రూబిన్ స్పష్టం చేశారు. తమపై భారత్ దాడిచేస్తే ప్రతీకారం బలంగా ఉంటుందని పాకిస్థాన్ ప్రగల్భాలన్నీ బూటకమని తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘భారత్ దెబ్బకు తోక ముడిచి కాలిగాలిన కుక్కలా తలవంచుకుని కాల్పుల విరమణ కోసం పరుగు తీయాల్సి వచ్చింది’ అని ఎద్దేవా చేశారు.
‘పాక్ సైన్యం జరిగిన దానిపై ఎలాంటి ప్రచారాన్ని చేసినా అది అసత్యమే అవుతుంది. వారు ఈ పోరాటంలో అత్యంత అసహయకరంగా, అవమానకరంగా ఓడిపోయారు’ అని రూబిన్ అన్నారు. భారత వాయుసేన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో పాాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రస్తావించారు.
‘‘ప్రపంచంలో అత్యంత అవినీతి పరమైన దేశాల్లో ఒకటైన పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ (IMF) రుణాన్ని ఆపడంలో అమెరికా విఫలమైంది’’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో రూబిన్ తీవ్రంగా విమర్శించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించి హిందువులను వారి కుటుంబాల ముందే హత్య చేసిన అనంతరం IMF ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడం ఘోర తప్పిదమని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ‘అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని వైట్‌హౌస్ కోరుతున్న సమయంలో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే... చైనాకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి 1 బిలియన్ డాలర్లు మంజూరు చేయడమంటే ట్రంప్‌ను IMF బహిరంగంగా అవమానించినట్లే,’ అని రూబిన్ వివరించారు. కాగా, పాక్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీపై భారత్ అభ్యంతరం చెప్పి.. ఓటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |