ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ నిర్ణయంతో బంగ్లా, చైనాలకు భారీ నష్టాలు

national |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 07:55 PM

భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగుదేశాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా, ఆర్థిక పరంగా గట్టిగా బుద్ధి చెబుతోంది. మనకు పొరుగునే ఉన్న చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలు.. నిత్యం భారత్ అంటే అక్కసు వెళ్లగక్కుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఈ 3 దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంతవరకు భారత్‌కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్.. ఆమె గద్దె దిగిపోవడంతో ఒక్కసారిగా శత్రుదేశంగా మారిపోయింది. ఇక చైనా, పాకిస్తాన్ అయితే గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌తో వైరం పెట్టుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 3 దేశాలకు బుద్ధి చెప్పేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ దేశాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.


భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే వస్త్రాలను ఆంక్షలు విధించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో దేశీయ వస్త్ర పరిశ్రమకు రూ.వెయ్యి 1000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల మేర కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని భారత్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయం కారణంగా దేశీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్‌ దుస్తుల సప్లై చైన్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల చలికాలంలో టీ-షర్ట్‌లు, డెనిమ్స్ దుస్తుల ధరలు 2-3 శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం.


దీనికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) శనివారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బంగ్లాదేశ్ నుంచి భూ సరిహద్దుల ద్వారా దుస్తులు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను భారత్ నిషేధించింది. అయితే కోల్‌కతా, నవ షేవా పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అనుమతి ఉంది. భారత్‌లోకి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకం లేని కారణంగా బంగ్లాదేశ్ నుంచి పన్ను లేకుండానే దిగుమతి అయ్యే వస్త్రాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా దేశీయంగా టెక్స్‌టైల్స్ పరిశ్రమను ప్రోత్సహించి.. విదేశీ దుస్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో చైనా నుంచి రహస్యంగా బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి మళ్లించబడుతున్న వస్తువులను కూడా అరికట్టవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే చైనా నుంచి భారత్‌లోకి నేరుగా రవాణా చేస్తే ప్రస్తుతం 20 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నారు.


భారత్ నుంచి ఎగుమతి అయ్యే నూలుపై ఏప్రిల్ నెలలోనే బంగ్లాదేశ్ పరిమితులు విధించిందని.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (సీఐటీఐ) ఛైర్మన్ రాకేష్ మెహ్రా తెలిపారు. ఇది సాంప్రదాయకంగా భారత్ మొత్తం నూలు ఎగుమతిలో దాదాపు 45 శాతం ఉంటుంది. బంగ్లాదేశ్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మకంగా భారత్ తీసుకున్న బలమైన ప్రతిస్పందనగా కనిపిస్తోందని రాకేష్ మెహ్రా వెల్లడించారు. ఈ నిర్ణయం బంగ్లాదేశ్ దుస్తుల దిగుమతి వ్యయాన్ని పెంచుతుందని.. దీని వల్ల దేశీయ రెడీమేడ్ గార్మెంట్ ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. భారత్ నుంచి నూలు ఎగుమతి చేసేవారు తమ సరఫరాను దేశీయ మార్కెట్‌కు మళ్లించడానికి వీలు కలుగుతుందని.. తద్వారా డిమాండ్ గ్యా్ప్‌ను పూరించవచ్చని పేర్కొన్నారు.


క్లాతింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఏఐ) అధ్యక్షుడు సంతోష్ కటారియా.. తక్కువ ధర కలిగిన బట్టలు భారతీయ రిటైల్ మార్కెట్‌లోకి అడ్డగోలుగా ప్రవేశిస్తున్నాయనే పరిశ్రమ దీర్ఘకాలిక ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుందని.. ఇది దేశీయ తయారీదారులపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com