ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చర్చల ద్వారానే భారత్‌తో సమస్యలు పరిష్కరించుకుంటాం

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 08:48 PM

బంగ్లాదేశ్ సర్కారును కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆ దేశ దిగుమతులపై న్యూ ఢిల్లీ ఆంక్షలు విధించింది. ఈక్రమంలోనే భారత్‌తో నెలకొన్న వాణిజ్య సమస్యలపై.. ఆదేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ తాజాగా స్పందించారు. ఇండియాతో ఉన్న సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడుతూ వాణిజ్య ఆంక్షలపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా తమకు అధికారిక సమాచారం అందలేదని పేర్కొన్నారు.


బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధినేతగా మారిన మహమ్మద్ యూనస్.. భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఇండియాపై ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతూ.. భారత్‌తో వివాదం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా గత నెలలో ఇండియా నుంచి వస్తున్న సరుకులపై బంగ్లా భారీ ఆంక్షలు విధించింది. ఇందుకు ప్రతిస్పందనగా న్యూఢిల్లీ సైతం ఆ దేశ దిగుమతులపై ఆంక్షలు పెట్టింది.


ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు కేవలం కోల్‌కతా, నవసేవ నౌకాశ్రయాల గుండా మాత్రమే భారత్‌లోకి అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రెడీమేడ్ గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కలప ఫర్నిచర్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటిని ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరం, ఫుల్‌బరి, కస్టమ్స్ స్టేషన్స్ గుండా రోడ్డు మార్గంలో భారత్‌లోకి ప్రవేశించడంపై నిషేధం విధించింది. దాదాపు 5 వారాల క్రితం ట్రాన్స్‌షిప్‌మెంట్ అవగాహనను కూడా భారత్ రద్దు చేసింది. దీంతో ఇతర దేశాలకు భారత్ గుండా రకరకాల ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది.


భారత్ విధించిన ఈ వాణిజ్య ఆంక్షలపై తాజాగా బంగ్లాదేశ్ స్పందించింది. ముఖ్యంగా బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. వాణిజ్య ఆంక్షలపై భారత ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని అన్నారు. భారత దేశం తీసుకున్న చర్యల గురించి తమకు సమాచారం అందిన తర్వాతే తాము ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ఇరు పక్షాలు చర్చించుకుని మరీ వాటిని పరిష్కరించుకునేందుకు తాము సిద్ధం అని అన్నారు. మరి భారత్ చర్చలకు అగీకరించిన సమస్యలను పరిష్కరించుకుంటుందా.. లేక తరచుగా మనపై కయ్యానికి కాలు దువ్వుతున్న బంగ్లాకు ఇలాగే చుక్కలు చూపిస్తుందా లేదా అనేది తెలుసుకుందాం.


ముఖ్యంగా అఖౌరా, డాకి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు వార్తల ద్వారా తెలిసిందన్నారు. ఇది రెండు దేశాలకు మంచి విషయం అని చెప్పారు. వస్త్ర పరిశ్రమలో భారత్ అగ్ర స్థానంలో ఉందని తాము భావిస్తున్నట్లు వివరించారు. అయినప్పటికీ ఆయా ఉత్పత్తులు తమ దేశం నుంచి కూడా ఎగుమతి అవుతున్నాయన్నారు. ఇది తమ సామర్థ్యంపై ఆధారపడి ఉందన్నారు. అయితే సహజంగానే వాణిజ్యం, రవాణా వంటి వాటిల్లో పోటీ ఉండడంతో.. కొన్ని సార్లు పరిమితులు విధించుకుంటున్నట్లు వివరించారు. ఇది వాణిజ్య ప్రక్రియలో ఓ భాగం మాత్రమేనని.. స్పష్టం చేశారు. కానీ చర్చలతోనే ఈ సమస్యలను పరిష్కరించుకుంటామని మరోసారి పునరుద్ఘాటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com