ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేన్సర్ బారిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్,,,,ఐదో దశలో ఉన్నట్టు నిర్దారణ

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 08:50 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రొస్టేట్ కేన్సర్ నిర్దారణ అయినట్టు ఆయన కార్యాలయం ఆదివారం ప్రకటించింది. కేన్సర్ ఇప్పటికే ఎముకల వరకు విస్తరించినట్లు వెల్లడించింది. మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతోన్న బైడెన్‌కు వైద్య పరీక్షలు చేయడంతో ప్రొస్టేట్‌ గ్రంథిలో ట్యూమర్ గుర్తించినట్టు పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కోసం కుటుంబసభ్యులు మార్గాలను పరిశీలిస్తున్నారని తెలిపింది. ‘ఇది తీవ్రమైన కేన్సర్ అయినప్పటికీ, హార్మోన్‌ల చికిత్స వల్ల తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందువల్ల మాజీ అధ్యక్షుడు, ఆయన కుటుంబం వైద్యుల సూచనలతో చికిత్సా అవకాశాలను పరిశీలిస్తున్నారు’ అని ప్రకటనలో వివరించారు. అనారోగ్య కారణాలతోనే జో బైడెన్ గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.


బైడెన్‌ కుమారుడు బ్యూ బైడెన్ 2015లో కేన్సర్‌తోనే మరణించారు. తాజా నివేదిక ప్రకారం.. బైడెన్‌కు ప్రస్తుతం గ్లీసన్ స్కోరు (కేన్సర్ నిర్దారణ దశ) 9 పాయింట్లుగా ఉంది. అంటే ఐదో దశలో ఉందని వైద్యులు తెలిపారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం.. ప్రొస్టేట్ కేన్సర్ గ్రేడ్ 5 అంటే ఇది ‘తీవ్ర అసాధారణమైంది. గ్లీసన్ స్కోరు గరిష్ఠంగా 10 వరకు ఉంటుంది. అంటే బైడెన్ పరిస్థితి అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు


అమెరికా పురుషులలో ప్రొస్టేట్ కేన్సర్ అత్యంత సాధారణమైంది. ప్రతి ఎనిమిదిలో ఒకరు దీన్ని జీవితకాలంలో ఎదుర్కొంటారని అమెరికన్ కేన్సర్ సొసైటీ చెబుతోంది. ఇది తొందరగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయమవుతుంది. కానీ, పురుషులలో కేన్సర్ మరణాల్లో ఇదే రెండో అతిపెద్ద కారణం. గతేడాది బ్రిటన్ రాజు చార్లెస్ 3 కేన్సర్ బారినపడిన విషయం తెలిసిందే.


బైడెన్‌కు కేన్సర్ బారినపడ్డారనే వార్త తెలియగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘ఈ వార్త నన్ను బాధించింది. బైడెన్ త్వరగా కోలుకోవాలి.. ఈ సమయంలో జిల్ ( బైడెన్ బార్య), ఆయన కుటుంబానికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టిన కమలా హ్యారిస్.. ‘జో ఒక పోరాటయోధుడు. ఆయన జీవితాన్ని, నాయకత్వాన్ని నిర్వచించిన ధైర్యం, నిబద్ధత, ఆశతో ఈ క్షణాన్ని ఎదుర్కొంటారని నమ్ముతున్నాను.. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


‘మిషెల్, నేను బైడెన్ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం. కేన్సర్ పరిశోధనలో ఎంతగానో కృషి చేసిన నాయకుడు జో. ఆయన ఈ కష్టం నుంచి గట్టెక్కుతారనే నమ్మకం ఉంది. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’ అని మాజీ అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు.


2024 ఎన్నికల సమయంలోనే ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు గురైంది. ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం కావడంతో జులై 2024లో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. కాగా, కేన్సర్‌పై బైడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 2022లో బైడెన్ మాట్లాడుతూ.. ‘మన పక్కన ఉన్న అందరికీ కేన్సర్ ఉంది. నేను కూడా కేన్సర్‌తో బాధపడుతున్నాను. డెలావేర్ రాష్ట్రంలో కేన్సర్ రేటు ఎప్పుడూ ఎక్కువగా ఉండేది’ అని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై కలకలం రేగడంతో అప్పట్లో వైట్ హౌస్ వివరణ ఇచ్చింది. ఆ సందర్భంలో ఆయన తనకు మునుపటి స్కిన్ కేన్సర్ గురించి మాత్రమే చెప్పారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com