ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో పెట్టుకోవద్దన్న ఐఎంఎఫ్.. షరతులకు పాక్ తలొగ్గుతుందా

international |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 08:51 PM

ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ భారత్ అభ్యంతరాలను పక్కనబెట్టి.. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రుణం మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, బెయిల్‌ఔట్ ప్యాకేజీ విషయంలో పాకిస్థాన్‌కు IMF షరతులు విధించింది. తదుపరి విడత రుణం విడుదల చేయాలంటే తాము విధించిన 11 కొత్త షరతులను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్‌తో ఘర్షణలను పెంచుకుంటే మీకే నష్టమని హెచ్చరించింది. పొరుగు దేశంతో ఉద్రిక్తతలు ఈ కార్యక్రమం ఆర్థిక, సంస్కరణల లక్ష్యాలను ప్రమాదంలోకి నెట్టొచ్చని ఐఎంఎఫ్ హెచ్చరికలు చేసింది. మీడియా నివేదికలను ఉటంకిస్తూ పీటీఐ ఈ విషయాన్ని తెలిపింది. పాక్‌కు నిధులు మంజూరును అమెరికా అడ్డుకోకపోవడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా సైనిక వ్యూహకర్త మిచెల్ రూబియో విమర్శించిన విషయం తెలిసిందే.


ఐఎంఎఫ్ షరతులు


రూ. 17.6 లక్షల కోట్ల కొత్త బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. విద్యుత్ బిల్లుల్లో అప్పులపై చార్జీల పెంపు. మూడేళ్లకు పైబడిన వాడిన కార్ల దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. ఐఎంఎఫ్ శనివారం విడుదల చేసిన స్టాఫ్ లెవెల్ నివేదిక ప్రకారం ‘భారత్, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కొనసాగితే లేదా మరింత పెరిగితే ఐఎంఎఫ్ కార్యక్రమ లక్ష్యాలకు ముప్పు ఏర్పడుతుంది’ అని స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం పాక్‌పై ఐఎంఎఫ్ 50కిపైగా షరతులు విధించినట్టు పాక్ మీడియా తెలిపింది.


బడ్జెట్ అనుసంధానం:


2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూన్ 2025 నాటికి ఐఎంఎఫ్ ఒప్పందం ప్రకారం పార్లమెంట్ ఆమోదించాలి. మొత్తం రూ. 17.6 లక్షల కోట్లు బడ్జెట్‌లో రూ. 1.07 లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించాలి.


రాష్ట్రాలపై షరతు:


నాలుగు రాష్ట్రాలు వ్యవసాయ ఆదాయ పన్ను చట్టాలను అమలు చేయాలి. ఇందులో పన్ను రిటర్నుల ప్రక్రియ, పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, రిజిస్ట్రేషన్, అవగాహన ప్రచారం, అమలు పథకం ఉన్నాయి. దీనికి చివరి గడువు: జూన్ 2025.


పాలనలో పారదర్శకత:


IMF గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్‌మెంట్ ఆధారంగా పాలన సంస్కరణల ప్రణాళికను ప్రచురించాలి. సంస్కరణ చర్యలను బహిరంగంగా గుర్తించడానికి, కీలకమైన పాలనా ఇబ్బందులను పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశం.


ఆర్థిక రంగ భవిష్యత్ వ్యూహం:


2027 తర్వాతి ఆర్థిక రంగానికి సంబంధించి వ్యూహాన్ని 2028 నుంచి అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించాలి.


ఇంధన రంగం– నాలుగు కొత్త షరతులు:


2025 జులై 1నాటికి విద్యుత్ చార్జీల మార్పులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ.


2026 ఫిబ్రవరి 15నాటికి గ్యాస్ టారిఫ్ సర్దుబాటు నోటిఫికేషన్.


క్యాప్టివ్ పవర్ లెవీ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చే బిల్లు మే నెలలో ఆమోదించాలి.


బాకీ చెల్లింపుల రికవరీ కోసం అమలవుతున్న రూ. 3.21 పైసల సర్జ్ ఛార్జ్ మాక్స్ క్యాప్‌ను ఎత్తివేయాలి.


ప్రత్యేక టెక్నాలజీ జోన్లపై పన్ను రాయితీలు


2035 నాటికి ప్రత్యేక టెక్ జోన్లకు ఇచ్చే ప్రోత్సాహాలను పూర్తిగా రద్దు చేసే ప్రణాళికను రూపొందించాలి. దీనికి గడువు: 2025 డిసెంబరు 31.


వినియోగించిన కార్ల దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేత


వాణిజ్య ప్రయోజనాల కోసం వాడిన కార్ల దిగుమతులపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ఐఎంఎఫ్ సూచించింది. ఇందుకు అవసరమైన చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి.


రక్షణ వ్యయం:


వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్థాన్ రక్షణ బడ్జెట్ రూ. 2.414 లక్షల కోట్లు. ఇది గత బడ్జెట్ కంటే రూ. 25,200 కోట్లు (12%) ఎక్కువ. అయితే, భారత్‌తో ఉద్రిక్తతల తర్వాత ఇది రూ. 2.5 లక్షల కోట్లకు (18% పెంపు) పెంచే యోచనలో పాక్ ఉంది.


భారత్-పాక్ మధ్య పరిణామాల ప్రస్తావన:


ఏప్రిల్ 22: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయి 26 మంది పర్యాటకులు.


మే 7: భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై క్షిపణి దాడులు.


మే 8–10: పాకిస్థాన్.. భారత సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులకు ప్రయత్నాలు.


మే 10: నాలుగు రోజుల తీవ్ర ఘర్షణల అనంతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి చేరుకున్నాయి.


ఇది పాకిస్థాన్ ఆర్థిక భద్రత, పాలన సామర్థ్యం, భారతదేశంతో సంబంధాల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఎంతగా ఒత్తిడి పెడుతుందో ప్రతిబింబిస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com