గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామన్న ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటనపై మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తీవ్రంగా స్పందించాయి. గాజాలో మానవతా సహాయాన్ని అడ్డుకుంటూ ఇజ్రాయేల్ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డాయి. దాడులను ఇలాగే కొనసాగిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించాయి. బ్రిటిష్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయేల్ సైనిక దాడులను విమర్శిస్తూ.. గాజాలో పరిస్థితులు దుర్బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఇజ్రాయేల్ తన దాడులను నిలిపివేయకపోతే మేము స్పష్టమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
మిత్రదేశాల హెచ్చరిక
‘నెతన్యాహు ప్రభుత్వం ఈ ఘోరమైన చర్యలు కొనసాగిస్తే మేము చూస్తూ ఊరుకోం... సైనిక దాడులను నిలిపి, మానవతా సహాయంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయకపోతే మేము తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని ఈ మూడుదేశాలు స్పష్టం చేశారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టంగా పేర్కొనకపోయినా.. ‘ప్యాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి, రెండు దేశాల పరిష్కారానికి మద్దతుగా మేము ముందుకు వెళ్తాం’ అని చెప్పారు. ఇజ్రాయేల్‌ను
22 దేశాల మద్దతు
బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా సహా 22 దేశాలు ‘గాజాలో తక్షణమే మానవతా సహాయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశాయి. గాజా ప్రజలు తీవ్ర పేదరికంలో కూరుకుపోయానని హెచ్చరించాయి. ఇజ్రాయేల్ మానవ సహాయాన్ని నిరాకరించడం అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి విరుద్ధం అని ఆ దేశాలు పేర్కొన్నాయి. అలాగే, ఇజ్రాయేల్ మంత్రులు చేసిన అమానవీయ వ్యాఖ్యలను, గాజా నుంచి పాలస్తీనియన్లను ఖాళీ చేయించే ప్రయత్నాలను ఖండించాయి. ఇది ‘శాశ్వత బలవంతపు మానవ వలస, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం’ అని నేతలు అన్నారు. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని సూచించాయి.
నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ఈ విమర్శలపై స్పందించిన నెతన్యాహు.. స్టార్మర్, మెక్రాన్, కార్నీల సంయుక్త ప్రకటనను ‘హమాస్‌కు ఇచ్చిన భారీ బహుమతిగా’ అభివర్ణించారు. ‘‘ఇజ్రాయేల్‌కు రక్షణ యుద్ధాన్ని ముగించమని, హమాస్‌ను అంతమొందించే ప్రక్రియ ఆగిపోవాలని మీరు చెబుతున్నారు. అదే సమయంలో పాలస్తీనియన్లకు దేశ హోదా కోరుతూ, మీరు అక్టోబర్ 7 న జరిగిన ఉగ్రవాద దాడికి బహుమతిగా మారుతున్నారు’ అని నెతన్యాహు అన్నారు. అంతేకాదు, ట్రంప్‌ను ఐరోపా నేతలు ఆదర్శంగా తీసుకోవాలని, ఇజ్రాయేల్‌కు అతడు నిజమైన మద్దతుదారు’ అని చెప్పారు. గాజాను ఎడారిగా మార్చేయాలని గతంలోనే ఇజ్రాయేల్ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.
మళ్లీ మొదటికొచ్చిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
యుద్ధం రేపే ముగిసిపోతుంది
‘యుద్ధం రేపే ముగియవచ్చు అయితే హమాస్ గ్యారంటీగా బంధీలను విడుదల చేయాలి, ఆయుధాలు వదలాలి, నాయకత్వం దేశం విడిచిపెట్టాలి.. గాజాను నిరాయుధీకరించాలి. ప్రపంచంలో ఏ దేశానికైనా ఇది తక్కువ కాదు. ఇజ్రాయేల్ అంతకుమించి దేనికీ అంగీకరించదు.. ఇది నాగరికతపై పోరాటం. ఇజ్రాయేల్ న్యాయంగా సమర్థంగా పోరాడుతుంది.. పూర్తి విజయం సాధించే వరకూ ఆగదు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘గాజాలో యుద్ధం తీవ్రమైంది. మేము పురోగమిస్తున్నాం... గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం’ అని చెప్పారు. ఇజ్రాయేల్ సైన్యం మార్చి 2 నుంచి గాజాకు సహాయం నిషేధించగా, తాజాగా కొద్దిపాటి సరఫరా ట్రక్కులు ప్రవేశించేందుకు అనుమతినిచ్చినట్టు ప్రకటించింది.
యుద్ధంలో ప్రాణనష్ట
అక్టోబర్ 7, 2023 హమాస్ దాడిలో 1,218 మంది ఇజ్రాయేల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాపై ఇజ్రాయేల్ యుద్ధం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణ అమల్లోకి రాగా..: మార్చి 18న ముగిసింది. అప్పటి నుంచి ఇజ్రాయేల్ తిరిగి దాడులు ప్రారంభించింది. ఈ రెండు నెలల్లో కనీసం 3,340 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తంగా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 53,486 మంది ప్రాణాలు కోల్పోయారు.
![]() |
![]() |