ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు మద్దతిస్తోన్న టర్కీకి భారత్ స్ట్రాంగ్ మెసేజ్

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 07:55 PM

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం జరిగిన పరిణామాలతో పాకిస్థాన్‌కు అన్ని రకాలుగా మద్దతు ఇస్తోన్న టర్కీకి భారత్ స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. టర్కీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన భారత్.. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు తూర్పు ఆసియా మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ: ‘పాకిస్థాన్ ప్రోత్సహిస్తోన్న సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు టర్కీ.. ఇస్లామాబాద్‌పై ఒత్తిడి తెస్తుందని మేము ఆశిస్తున్నాం. దశాబ్దాలుగా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్ర మౌలిక సదుపాయాలపై నమ్మదగిన, ధ్రువీకరించగల చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, ఒకరిపై ఒకరు ఉన్న అవగాహన.. ఆందోళనలను అర్థం చేసుకోవడంపై ఆధారపడతాయి’ అని పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో బాయ్‌కాట్ టర్కీ నినాదం ఊపందుకుంది.


జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు టర్కీ మద్దతుగా నిలవడంతో భారత్- అంకారా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ కేవలం సైద్ధాంతిక, మానవతా మద్దతుతోనే సరిపెట్టకుండా ఆయుధాలు, డ్రోన్లను కూడా సరఫరా చేసింది. పాకిస్థాన్ దాడుల్లో ఉపయోగించిన 300-400 డ్రోన్లలో ఎక్కువ శాతం టర్కీ నుంచే వచ్చాయని భారత్ తెలిపింది. ఈ డ్రోన్లు సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు జరిపాయి. లడఖ్‌లోని లేహ్ నుంచి గుజరాత్‌లోని సిర్‌క్రీక్ వరకు పశ్చిమ సరిహద్దులో మొత్తం 36 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించింది.


ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై భారత్ దాడుల తర్వాత కూడా టర్కీ పాక్ పక్షాన నిలిచింది. అదే సమయంలో పహల్గామ్ దాడిలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఉగ్రవాదులు ఉన్నప్పటికీ టర్కీ ఈ దాడిని ఖండించలేదు. జమ్ము కశ్మీర్‌పై పాకిస్థాన్ ఆక్రమణకు టర్కీ మద్దతు ఇచ్చిన చరిత్ర ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తన యుద్ధ నౌకను కరాచీ పోర్టుకు పంపిన టర్కీ.. దీనిని సాధారణ పర్యటనగా పేర్కొన్నా, ఇది వ్యూహాత్మక సంకేతంగా పరిగణించాల్సిందే.


భారత్ చేసిన సాయం మరిచిపోయిన టర్కీ.. పాకిస్థాన్‌కు సాయం


ఆయుధాలతోపాటు యుద్ధ విమానాలను టర్కీ పంపినట్టు నివేదికలున్నాయి. అయితే టర్కీ వాటిని ఖండించింది. – విమానాలు కేవలం ఇంధనం నింపుకోవడానికే వచ్చాయని తెలిపింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను.. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ అభినందించారు. అంతేకాక నిజమైన స్నేహానికి నిదర్శనం పాకిస్థాన్ అంటూ వ్యాఖ్యానించారు.


ఉగ్రవాద శిభిరాలపై భారత్ సైన్యం దాడి తర్వాత, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు సానుభూతి సందేశం పంపించారు. ‘ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సోదరుల కోసం అల్లాహ్ దయ చూపాలని ప్రార్థిస్తున్నాను.. పాకిస్థాన్ ప్రజలకు, ప్రభుత్వానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’" అని ఆ సందేశంలో పేర్కొన్నారు. భారత్‌లో పెరుగుతున్న టర్కీపై వ్యతిరేకత, భావోద్వేగాల నేపథ్యంలో ఆ దేశ వస్తువులు, సేవలపై సంపూర్ణ బహిష్కరణకు భారతీయులు పిలుపునిచ్చారు. టర్కీ పర్యటనలకు వెళ్లొద్దని.. భారతీయ సినిమాలు టర్కీలో షూటింగ్ చేయకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com