ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు.. ఏకంగా 8500 నిర్మాణాలు కూల్చివేత

national |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 07:59 PM

దేశంలోని చాలా రాష్ట్రాల్లో చెరువులు, సరస్సులు, ప్రభుత్వ భూములు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను.. అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. అక్రమ కట్టడాలను సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక తెలంగాణలో అయితే హైడ్రా పేరుతో ఒక విభాగాన్నే ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. చెరువులు, కుంటలు, నీటి వనరులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైన కఠిన చర్యలు ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో కూడా అధికారులు.. ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని చందోల సరస్సు వద్ద భారీగా నిర్మించిన అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా ఏకంగా 8500 నిర్మాణాలను కూల్చివేశారు.


డానిలిమ్డాలోని చందోల సరస్సు వద్ద అక్రమ కట్టడాలను తొలగించే పనుల్లో భాగంగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెండవ దశ ఆపరేషన్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభించారు. ఈ కూల్చివేత ఆపరేషన్‌లో భాగంగా 8500 అక్రమ నిర్మాణాలను తొలగించారు. చందోల సరస్సులోని 2.50 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అయితే ఈ ఆపరేషన్‌ను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. అహ్మదాబాద్ నగరంలోని 7 జోన్‌ల నుంచి కార్పొరేషన్‌కు చెందిన 350 మంది సిబ్బంది 50 టీమ్‌లుగా పాల్గొన్నాయి. చందోల సరస్సు ప్రాంతాన్ని మొత్తంగా 7 బ్లాక్‌లుగా విభజించి.. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు.


మొత్తంగా 35 బుల్డోజర్లు, 15 ఎర్త్‌మూవర్ యంత్రాలను తీసుకువచ్చి.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శిథిలాల తొలగింపు, సరస్సును మరింత లోతు చేయడం, సరిహద్దు గోడ నిర్మాణం, సరస్సు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వంటివి అధికారులు భవిష్యత్ ప్రణాళికలలో చేర్చారు. డానిలిమ్డాలో ఉన్న చందోల సరస్సు గుజరాత్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడంపై చర్చలు జరిగినా.. ప్రస్తుత ఆక్రమణల కారణంగా దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కార్పొరేషన్ అధికారులు. దీంతో చందోల సరస్సు ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత.. దాదాపు ఒక ఏడాది క్రితం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదించిన టెండర్ ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు ముందుకు సాగనున్నాయి.


మొదటి దశలో పోలీసుల సహాయంతో అక్రమ ఆక్రమణలను తొలగించిన తర్వాత మిగిలిన రెండవ దశలో భూమిని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ క్లియర్ చేయనుంది. అయితే భారీ ఎత్తున కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేత డ్రైవ్ సమయంలో అక్కడ శాంతి భద్రతలను కాపాడటానికి 3 వేల మందికి పైగా పోలీసులు, స్టేట్ రిజర్వ్ పోలీస్ సిబ్బందిని మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మొదటి దశలో సంఘ విద్రోహ శక్తులు, అక్రమంగా స్థిరపడిన బంగ్లాదేశీయులను గుర్తించినట్లు వెల్లడించారు. కూల్చివేత మొదటి దశకు ముందు.. చందోల సరస్సులో అక్రమంగా నివసిస్తున్న 202 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో దశలో మిగిలిన ఆక్రమణలను క్లియర్ చేయాలని అహ్మదాబాద్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుందని పోలీసులు తెలిపారు.


అయితే ఈ చందోల సరస్సులోని అక్రమ నిర్మాణాలు.. గతంలో నిర్వహించిన డ్రోన్ సర్వేలో వెలుగులోకి వచ్చాయి. సరస్సుకు చెందిన భూభాగంలో దాదాపు 8 వేల ఇళ్లు అక్రమంగా నిర్మించబడ్డాయి. మొదటి దశ కూల్చివేత తర్వాత 2010 నుంచి లేదా అంతకుముందు నుంచి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తామని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.


మొదటి దశ కూల్చివేతలో భాగంగా ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు 3 రోజుల పాటు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ నగర పోలీసులు చందోల సరస్సు వద్ద అక్రమ నిర్మాణాలను తొలగించడానికి ఒక ఆపరేషన్‌ను నిర్వహించారు. తొలి రోజు 1 లక్ష చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేశారు. ఇందులో ఫామ్‌హౌస్‌లు, గిడ్డంగులు, తాత్కాలిక నివాసాలు ఉన్నాయి. రెండో రోజు 50 వేల చదరపు మీటర్ల ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు తొలగించారు. చివరి రోజు ఘోడాసార్ సమీపంలో 25 దుకాణాలు, 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెద్ద గిడ్డంగి వంటి వాణిజ్య సంస్థలపైనా దృష్టి సారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com