ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై పదో తరగతి, ఇంటర్‌లో 33 మార్కులు వస్తే పాస్

national |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 07:57 PM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 శాతం .మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం 35 శాతం మార్కుల నిబంధనను తగ్గించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి SSLC (పదో తరగతి) PUC II (ఇంటర్) పరీక్షల మూల్యాంకన విధానంలో కొత్త నిబంధనలను అమలుచేయనుంది. ఈ ముసాయిదా నిబంధనల్లో రెండు కీలక సూచనలు ప్రకటించింది. ఒకటి పాస్ మార్కులను తగ్గించడం, రెండు అంతర్గత మూల్యాంకన (ప్రాక్టికల్స్) మార్కులను పాస్ మార్కులకు కలపడం.


SSLC పరీక్షలలో మొత్తం మార్కులలో కనీసం 33% మార్కులు విద్యార్థి సాధిస్తే పాస్ అయినట్టే. ఇప్పటివరకు ఇది 35%గా ఉండేది. ఇకపై, విద్యార్థి అంతర్గత మూల్యాంకన, బాహ్య పరీక్షల్లో పొందిన మార్కుల మొత్తం 33% ఉంటే సరిపోతుంది. మొత్తం 625 మార్కులకు కనీసం 206 మార్కులు (ప్రతి సబ్జెక్ట్‌ కనీసం 30%) పొందితే ఉత్తీర్ణులవుతారు.


ఫస్ట్ లాంగ్వేజ్‌కు మొత్తం మార్కులు 125 యథావిధిగా కొనసాగుతుంది. మిగతా ఐదు సబ్జెక్ట్‌లు ఒక్కోదానికి 100 మార్కుల్లో ఎలాంటి మార్పులేదు. కర్ణాటక సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డు ఫస్ట్ రెగ్యులేషన్స్ (సవరణ) 2025 అనే నిబంధనల ద్వారా ఇవి అమల్లోకి వస్తాయి. జులై 22న కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థి మొత్తం మార్కుల్లో కనీసం 33% సాధిస్తే చాలు. ప్రస్తుతం ఇది కూడా 35%. అలాగే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 30% మార్కులు రావాలి. వీటిని రాత పరీక్ష, అంతర్గత లేదా ప్రాక్టికల్ పరీక్షలో మార్కులను కలిపి లెక్కిస్తారు..


ప్రాక్టికల్స్ లేదా అంతర్గత మూల్యాంకనం లేని సబ్జెక్ట్‌‌లో 80 మార్కుల రాత పరీక్షలో కనీసం 24 మార్కులు సాధించాలి. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్ట్ రాత పరీక్ష 70 మార్కులకు ఉండే.. కనీసం 21 మార్కులు రావాలి. ప్రాక్టికల్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు ప్రాక్టికల్స్‌కు 30 మార్కులు ఉండగా, ఇకపై 20 మార్కులకు నిర్వహిస్తారు. మిగతా 10 మార్కులు ప్రతి సబ్జెక్ట్‌ (థియరీ, ప్రాక్టికల్) కనీసం 75% హాజరు, నిర్దేశించిన సంఖ్యలో ప్రాక్టికల్స్‌ను నిర్వహించడం, లెక్చరర్ సర్టిఫై చేసిన ప్రాక్టికల్ రికార్డు సమర్పించడం, ప్రాక్టికల్ పరీక్షకు హాజరు వాటి ఆధారంగా ఉంటాయి.


సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వంటి కేంద్ర విద్యా బోర్డుల విధానాలకు అనుగుణంగా ఈ మార్పులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో దేశంలో కర్ణాటక తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవుతోంది. అంతర్గత మార్కుల గణన లేకపోవడం, పాస్ మార్కులు ఎక్కువగా ఉండటమేనని ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతిలో 62 శాతం, ఇంటర్‌లో 69.16 శాతం ఉత్తీర్ణత సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa