ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 29, 2025, 06:21 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్ లో మూడోరోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు తెలియచేశారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. అలాగే దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని... 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటం వ్యాలీ ఎకో సిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందటంతో పాటు పరిశోధనలకూ ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి.నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.నగరాభివృద్ధి, వాణిజ్య సదుపాయాలు, మౌలిక వసతుల రంగాల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన కెప్పెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిమ్ యాంగ్ వియ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. సింగపూర్ లో మూడో రోజు పర్యటనలో భాగంగా సీఎం వివిధ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలతో బేటీ అయ్యారు. అమరావతి నగర అభివృద్ధిలో కెప్పెల్ భాగస్వామ్యంపై ప్రధానంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం విశాఖను గ్రోత్ ఇంజిన్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, వాణిజ్యం, గృహ నిర్మాణ రంగాల్లో ప్రాజెక్టుల అభివృద్ధికి కెప్పెల్‌ను ఆహ్వానించారు.అమరావతి నగర అభివృద్ధి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ (జీఐసీ) సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ బ్రాన్ యోతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. జీఐసీతో దీర్ఘకాలిక భాగస్వామ్యం, స్థిరమైన పెట్టుబడులపై ప్రణాళికల రూపకల్పనపై చర్చించారు. వైద్య, విద్య, పట్టణ ప్రణాళిక, పౌర సదుపాయాలు వంటి రంగాల్లో జీఐసీ పెట్టుబడులు పెట్టేలా అనువైన వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఆపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.  అలాగే, విల్మార్ ఇంటర్నేషనల్ సంస్థ గ్రూప్ హెడ్ రాహుల్ కలేతో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎడిబుల్ ఆయిల్స్, అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. రైతులకు విలువ ఆధారిత మార్కెట్‌ను కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్‌లో సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా విల్మర్ టెక్నాలజీ అందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ఆ దేశ మానవనరులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి టాన్సీ లెంగ్ కీలక ప్రకటన చేశారు. వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యంగా ఉండేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖలోని మానవ వనరులు, శాస్త్రసాంకేతిక మంత్రి టాన్ సీ లెంగ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.వివిధ అభివృద్ది ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధమన్న సింగపూర్ మంత్రి టాన్సీ లెంగ్ ప్రకటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియచేశారు. ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి, ఆ దేశ మంత్రి టాన్ సీ లెంగ్ కు ఎక్స్ వేదికగా సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సుస్థిరాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉండడానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు. వివిధ రంగాల్లో ఏపీ-సింగపూర్ కలిసి పని చేయడానికి టాన్ సీ లెంగ్ తో జరిపిన చర్చలు బాటలు వేశాయని సీఎం పేర్కోన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa