ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేవీ ఉద్యోగితో వివాహం,,,,పెళ్లి సమయంలో రూ.15 లక్షల కట్నం డిమాండ్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:00 PM

కొత్త జీవితాన్ని, బంగారు భవిష్యత్తును ఊహించుకుని అత్తింటిలో అడుగుపెట్టిన ఓ మహిళ.. పెళ్లైన ఐదు నెలలకే ఈ లోకాన్ని వీడి కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. స్నేహితులే కాదు.. పుట్టింటివాళ్లతో మాట్లాడొద్దని నిత్యం వేధింపులకు గురిచేసిన భర్త నరకం చూపించడంతో ఆమె జీవితాన్ని ముగించింది. భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్చెంట్ నేవీ అధికారికి పనిచేస్తోన్న అనురాగ్ సింగ్‌.. మధు (32) మ్యాట్రిమెనియల్ సైట్‌‌లో కలిశారని, ఫిబ్రవరి 25న వివాహం జరిగిందని తెలిపారు. అనురాగ్ సింగ్ హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే నౌకాయాన సంస్థలో పనిచేస్తున్నట్టు చెప్పారు. పెళ్లి సమయంలో రూ.15 లక్షలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ ఆమె కుటుంబం షేర్ చేసిన వాట్సాప్ చాట్‌ల ద్వారా వెల్లడయ్యింది. మధు తల్లిదండ్రులు కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇవ్వగలమని అంటే.. కేవలం 150 మంది అతిథులకే ఏర్పాట్లు చేస్తాను కానీ తాను కట్నం డిమాండ్‌ను తగ్గించలేనని చెప్పడం వాట్సాప్ చాట్‌లో ఉంది.


మధు తండ్రి ఫతే బహుదూర్ సింగ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో.. పెళ్లై నెల రోజులైనా కాకముందే హోలీ రోజున తన కుమార్తెపై చేయిచేసుకున్నాడని, దీంతో పుట్టింటికి వచ్చేసిందని పేర్కొన్నాడు. అడిగినంత కట్నం ఇవ్వడంతో అనురాగ్ తన కుమార్తెను తీసుకెళ్లాడు కానీ హింసించడం ఆపలేదని ఆరోపించారు.


మధు సోదరి ప్రియ మాట్లాడుతూ.. తను అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది కానీ, ఆమెను అనురాగ్ ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. ‘ఆమెకు సామాజిక జీవితం ఉండాలని కోరుకోలేదు... ఆమె స్నేహితులే కాదు మాతోనూ మాట్లాడొద్దని కండిషన్లు పెట్టాడు.. అతడు ఊర్లో లేనప్పుడు మాత్రమే మేము మాట్లాడేవాళ్లం... ఎటువంటి కారణం లేకుండా కొట్టేవాడని, తనతో కలిసి మద్యం సేవించాలని ఒత్తిడి చేశాడు.. పెళ్లైన తర్వాత స్నేహితులతో వదులుకుంది.... అనురాగ్ బయటకు వెళ్లేటప్పుడు మాత్రమే ఫోన్ చేసేది.. మధు ఫోన్‌ను తరుచూ చెక్ చేసి ఎవరెవరితో మాట్లాడింది కాల్ రికార్డులు చూసేవాడు’ అని వాపోయింది.


చివరిసారి తమ మధ్య జరిగిన సంభాషణలో అనురాగ్ దాడి గురించి తనకు చెప్పిందని ప్రియ తెలిపింది. ‘వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె కారు నడుపుతోంది. రోడ్డుపై గుంతలు, ఇంతలో వర్షం పడుతుంటడంతో ఎడమవైపు చూసుకుంటూ కారు నడుపుతుంటే... అక్కడే ఉణ్న కొందరు యువకులను చూడటానికే ఇలా చేశావని అనుమానించి గొడవపడి కొట్టాడు.. మధును తీసుకొద్దామని అనుకున్నాం కానీ.. కానీ మళ్ళీ గొడవ పెద్దదవుతుందని వద్దని చెప్పింది..’ అని తెలిపింది.


అయితే, పెళ్లికి ముందు ఓ అమ్మాయిని ప్రేమించిన అనురాగ్.. ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నట్టు మధు తండ్రి ఆరోపించారు. లక్నోలోని ఓ హోటల్‌లో ఇటీవల తన మాజీ ప్రియురాలితో గడిపాడని అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. తన కుమార్తె గర్బం దాల్చితే.. బలవంతంగా అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆగస్టు 3న ప్రియకు ఫోన్ చేసి.. అనురాగ్ తనను కొట్టాడని చెప్పిందని, మర్నాడు ఆగస్టు 4 సాయంత్రం 4.30 గంటలకు అతడు ఫోన్ చేసి మధు ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చాడు’ అని ఫిర్యాదులో వివరించాడు. మాజీ ప్రియురాలు, తన భర్తకు మధ్య జరిగిన చాటింగ్‌‌లు కంటబడటంతో వాటిని తన మొబైల్ ఫోన్‌కు మధు షేర్ చేసింది.


మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు మధు ఉరేసుకున్నట్టు గుర్తించి, 112 హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసినట్టు నిందితుడు చెప్పారు. కానీ, మధు కుటుంబం మాత్రం తమకు 4.30 గంటలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఆ రోజు పనికి రావద్దంటూ పనిమనిషికి అనురాగ్ పంపిన మెసేజ్‌ను పోలీసులు గుర్తించారు. దానిని చూసుకోని పనిమనిషి ఇంటికొచ్చింది. పలుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తలుపు తెరవలేదు. అయితే, ఉదయం 10.30 గంటలకు నిందితుడు అనురాగ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టు గుర్తించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa