ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్ కారణంగా మంగళవారం (ఆగస్టు 5న) సంభవించిన మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకూ ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికిపైగా గల్లంతయ్యారు. ధరాళీ గ్రామానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్షాలీ సైనిక శిబిరం కూడా కొట్టుకుపోగా.. అందులోని 10 మందికిపైగా జవాన్లు ఏమయ్యారో తెలియరాలేదు. తాజాగా, కేరళకు చెందిన 28 మంది పర్యాటకుల బృందం ఆచూకీ కూడా గల్తంతైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 28 మందిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడినవారని, మిగతా 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందినవారని పర్యాటకుల్లోని ఒకరి బంధువు అన్నారు. తమ బంధువులు చివరిసారిగా వారి కుమారుడితో దుర్ఘటనకు కొద్ది గంటల ముందు మాట్లాడినట్టు ఆమె తెలిపారు.
‘‘మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి బయలుదేరినట్టు చెప్పారు.. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి.. ఆ తర్వాత నుంచి వాళ్లతో ఎటువంటి కాంటాక్ట్ లేదు’’ అని ఆమె పేర్కొన్నారు. హరిద్వార్‌కు చెందిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా పది రోజుల ఉత్తరాఖండ్ పర్యటనకు వచ్చారని, వాళ్లు కూడా పర్యాటకుల బృందం క్షేమసమాచారం గురించి ఇప్పటి వరకూ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదన్నారు. ‘బహుశా వారి ఫోన్‌లు ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు.. ఆ ప్రాంతంలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేదు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
దేవభూమిలో ప్రకృతి ప్రకోపానికి ఉత్తరకాశీ జిల్లా ధరాళీ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. కొండచరియలు విరిగిపడి.. బురద మొత్తం గ్రామాన్ని కప్పేసింది. క్లౌడ్‌బరస్ట్‌తో ఖీర్ గంగా నదిలో ఒక్కసారిగా ప్రవాహం పోటెత్తి.. మెరుపు వరదలు సంభవించాయి. కొండలపై నుంచి దూసుకొచ్చిన నదీ ప్రవాహం గ్రామాన్ని ముంచెత్తింది. కేవలం 20 సెకెన్లలోనే అంతా మట్టిలో కలిసిపోయింది. గ్రామం సగభాగం భూస్థాపితమైపోయిందని అధికారులు తెలిపారు. ధరాళీని వరద ముంచెత్తిన సమయంలో ఎగువ ప్రాంతంలో ఉన్న స్థానికులు రికార్డు చేశారు. గ్రామం మీదుగా భారీ వరద, బురద, బండరాళ్లు దూసుకొచ్చి భవనాలను నేలమట్టం చేసిన ఒళ్లు గగ్గుర్పొిచే వీడియోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది.
ఖీర్ గంగా పరివాహక ప్రాంతంలో కొద్దిగంటల్లోనే ఆకాశానికి చిల్లుపడినట్టు కురిసిన వర్షంతో వరద పోటెత్తింది. దీంతో ఖీర్ గంగా కొండల మీద నుంచి ప్రవాహం రాకను గమనించి స్థానికులు.. పరుగెత్తండి.. పరుగెత్తండి అంటూ అరుస్తూ ప్రాణభయంతో వణికిపోవడం వీడియోల్లో రికార్డయ్యింది. కానీ, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. అనేక భవనాలు, నివాసాలు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద అనేక మది చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa