ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా పన్ను చెల్లింపుదారులకు రిబేట్ పెంచి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంకా ఇదే సమయంలో ఆదాయపు పన్ను చట్టం- 1961 స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి కొత్త పన్ను బిల్లును కూడా రూపొందించారు. ఇదే 6 దశాబ్దాలుగా అమల్లో ఉన్న పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుందని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే తాజాగా ఆ పన్ను బిల్లు- 2025 ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఏమైందో ఏమో గానీ సడెన్‌గా కేంద్రం.. దానిని ఉపసంహరించుకున్నట్లు సమాచారం.
దీంట్లో కొన్ని సవరణలు చేసి అప్డేటెడ్ వెర్షన్ బిల్లును సోమవారం రోజు తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు విశ్వసనీయ వర్గాల్ని ఉటంకిస్తూ ఇప్పటికే ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్రం.. ఫిబ్రవరి 13నే లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై అప్పటి నుంచి విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపింది కేంద్రం.
సెలక్ట్ కమిటీ.. బిల్లును పరిశీలించి అధ్యయనం చేసి జులై 21న తమ రిపోర్టును పార్లమెంటుకు సమర్పించింది. ఇక ఈ 4500 పేజీలతో కూడిన రిపోర్టులో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. దీనిని కేంద్రం పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగానే కొత్త బిల్లు తెచ్చేందుకు సిద్ధమైంది. దీంట్లో సవరణలు అంటే మార్పులు చేర్పులు చేసి.. కొత్త బిల్లును ఆగస్ట్ 11న తిరిగి ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.
సెలక్ట్ కమిటీ చేసిన ప్రధాన సూచనల్లో ముందుగా ఇంటిపై ఆదాయం పొందుతున్న వారికి ఊరట దక్కేలా కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. హోం లోన్ వడ్డీతో టాక్స్ బెనిఫిట్స్ ప్రస్తుతానికి సొంతింట్లో ఉండే వారికే వర్తిస్తుండగా.. సొంతిల్లును రెంట్‌కు ఇచ్చిన వారికి కూడా వడ్డీతో పన్ను మినహాయింపు కల్పించాలని కమిటీ సూచించింది. ఇదే సమయంలో టీడీఎస్, టీసీఎస్ రిఫండ్స్‌ను కూడా మరింత సరళతరం చేయాలని ప్రతిపాదించింది.
1961 పన్ను చట్టానికి 66 బడ్జెట్లలో చాలానే సవరణలు జరిగాయి. ఈ క్రమంలోనే ఇది చాలా సంక్లిష్టంగా తయారైంది. అందుకే దీనిని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చట్టాన్ని సమీక్షించి.. సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్ సమయంలోనే కేంద్రం పేర్కొనగా.. కిందటి బడ్జెట్‌లో దీనిని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa