బిహార్ ఓట్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై యుద్ధం ప్రకటించిన ప్రతిపక్షాలు.. గత రెండు రోజులుగా పార్లమెంట్ ఎదుట నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రతిపక్ష ఎంపీలు ధరించిన టీ-షర్టులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ‘మింతా దేవి 124 నాటౌట్’ అంటూ ఓ మహిళ ఫోటో వాటిపై ముద్రించడమే దీనికి కారణం. దీంతో ఆమె ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఇటీవల ఈసీ ప్రకటించిన బిహార్ ఓటర్ల జాబితాలో 124 ఏళ్ల వయసున్న మింటా దేవి అనే మహిళ తొలిసారి పేరు నమోదు చేసుకున్నట్టు ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల చోరీ గురించి పలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈసీపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మింతా దేవి ఓటు నమోదు గురించి ఆయన బయటపెట్టారు.
‘ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇటువంటివి చాలా కేసులు ఉన్నాయి.. త్వరలోనే సినిమా పూర్తిగా రాబోతోంది’ అని మింటా దేవి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిచ్చారు. ప్రతిపక్ష ఎంపీలతో సహా ఈ టీ-షర్టులు ధరించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయని, బంధువులు, చిరునామాలు మొదలైన ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.
కాగా, మీడియా విచారణలో శివాన్ జిల్లా దరౌండా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మింతా దేవి అనే మహిళా ఓటర్ ఉన్నట్టు తేలింది. అయితే, ఆమె వయసు 124 ఏళ్లకు కాదు.. 35 సంవత్సరాలు. ఈ వివాదంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందిస్తూ.. దరఖాస్తులో తప్పిదం వల్లే ఇలా జరిగిందని, వయసు పొరపాటు తప్పుగా నమోదయ్యిందని వివరణ ఇచ్చింది.
ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటుచేసిన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. బీజేపీ చెప్పినట్టు ఈసీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఈసీ గెలిపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు ఎన్నికల సంఘం దాసోహమైందని, తమ వద్ద అనేక ఆధారాలు, రుజువులు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa