ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు సర్కారు విచిత్రమైన సూచన.. ఈ-మెయిల్స్ తొలగిస్తే నీళ్లు ఆదా అవుతాయట!

international |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 10:07 PM

సాధారణంగా మన దగ్గర నీటి కరువు వస్తే.. వాడకం తగ్గించమని చెబుతుంటుంది సర్కారు. స్నానం చేయడం, చెట్లకు నీళ్లు పోయడం, ఇళ్లు, బాత్రూంలు వంటివి కడగడం తగ్గించమని.. వీలైతే తడి తువ్వాలుతోనే ఒళ్లు తుడుచుకుని.. నీటిని ఆదా చేయాలని సూచిస్తుంటుంది. ఇప్పటి వరకు మనం ఇలాంటి వార్తలు చాలానే విన్నాం. ప్రజలు ఇలా చేస్తూ నీళ్లను ఆదా చేసుకోవడం కూడా మన కళ్లారా చూశాం. కానీ యూకేలో మాత్రం నీటిని ఆదా చేసేందుకు.. పాత ఈ-మెయిళ్లను డిలీట్ చేయాలని అక్కడి సర్కారు చెబుతోంది. ఇలా చేస్తే నీటిని ఆదా చేయొచ్చని వివరిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ-మెయిల్స్ డిలీట్ చేస్తే.. నీరెలా ఆదా అవుతుందని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ కథ చదివేయాల్సిందే.


ఈ-మెయిల్స్‌కు నీళ్లకు సంబంధం ఏమిటి?


ఈ-మెయిల్స్‌కు నీటిని ఆదా చేయడానికి అసలు సంబంధం ఏంటనేది అందరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ విచిత్రమైన సూచన వెనుక ఓ ముఖ్యమైన కారణమే ఉంది. పాత ఈ-మెయిల్స్, క్లౌడ్‌లో నిల్వ చేసిన ఫొటోలు, ఇతర డిజిటల్ డేటాను నిల్వ చేయడానికి వేల సంఖ్యలో డేటా సెంటర్లు పని చేస్తాయి. ఈ డేటా సెంటర్లు నిరంతరం వేడిని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ వేడిని తగ్గించడానికి భారీ మొత్తంలో నీటిని వినియోగిస్తూ.. సిస్టమ్‌లను చల్లబరుస్తుంటారు. ఈ క్రమంలోనే లక్షల లీటర్ల నీరు వృథా అవుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పాత ఈ-మెయిల్స్, అనవసరమైన డేటాను తొలగించడం ద్వారా ఈ డేటా సెంటర్ల పని భారాన్ని.. తద్వారా నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని యూకే పర్యావరణ సంస్థ డైరెక్టర్ హెలెన్ వేక్‌హామ్ తెలిపారు.


తీవ్రమైన కరువు పరిస్థితి


యూకేలో ఈ ఏడాది వేసవి కాలంలో ఇది నాలుగవ వేడి అల (heatwave). దీని ప్రభావంతో ఇంగ్లాండ్‌లోని ఐదు ప్రాంతాలను అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. మరో ఆరు ప్రాంతాల్లో సుదీర్ఘమైన పొడి వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా నీటి ఆదాకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే యార్‌క్షైర్, గ్రేటర్ మాంచెస్టర్ వంటి ప్రాంతాల్లో హోస్‌పైప్ వాడకంపై నిషేధం విధించారు. నీటిని దుర్వినియోగం చేయకుండా ప్రజలు ఆంక్షలను పాటిస్తున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కరువు నదులు, వన్యప్రాణుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


పాత ఈ-మెయిల్స్ తొలగించాలనే సలహాతో పాటు నీటిని ఆదా చేయడానికి ప్రభుత్వం కొన్ని సాధారణ సూచనలను కూడా జారీ చేసింది. వర్షపు నీటిని సేకరించి తోటపని కోసం ఉపయోగించాలని చెప్పింది. అలాగే లీక్ అయ్యే నల్లాలను బాగు చేయించుకోవాలని సూచించంది. వీటి వల్ల రోజుకు 200-400 లీటర్ల నీటిని వృథా అవుతాయని పేర్కొంది. అంతేకాకుండా కూరగాయలు కడగడం, ఇతర వాటికోసం వినియోగించిన నీటిని మొక్కలకు పోయాలని సూచించింది. పచ్చిక బయళ్లకు నీళ్లు పోయడం మానేయాలని చెప్పింది. వర్షం పడితే అదే మళ్లీ పెరుగుతుందని పేర్కొంది. పళ్లు తోముకునేటప్పుడు, షేవింగ్ చేసుకునేటప్పుడు నల్లాలను ఆపేసే ఉంచాలని తెలిపింది. అలాగే షవర్ బాత్ చేయకుండా బకెట్లో నీళ్లు పెట్టుకుని చేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa