పాకిస్థాన్ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతూనే ఉంటాయి. అక్కడ సైనిక నాయకుల ప్రకటనలు, ప్రవర్తనపై ప్రపంచం నిరంతరం దృష్టి సారిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఓ సున్నితమైన సమయంలో.. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఒక కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా నెలల తరబడి కొనసాగుతున్న రాజకీయ పుకార్లకు తెర దించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని పదవి నుంచి తొలగించి.. ఆయన స్థానంలో తాను అధ్యక్ష బాధ్యతలు చేపడతానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన పాకిస్థాన్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరతపై సైన్యం తన వైఖరిని మరోసారి తేటతెల్లం చేసింది.
అమెరికా పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్లే మార్గంలో బెల్జియంలో ఆగిన అసిమ్ మునీర్, పాక్ మీడియాకు చెందిన ఒక ప్రముఖ కాలమిస్ట్‌తో మాట్లాడుతూ.. ఈ పుకార్లను పూర్తిగా తీవ్రంగా ఖండించారు. ఈ వార్తలన్నీ కేవలం ప్రచార కల్పనలేనని, పాకిస్థాన్ నాయకత్వంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్థాన్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరచడానికి.. దేశంలో రాజకీయ అరాచకాన్ని సృష్టించడానికి ఈ తరహా పుకార్లను ప్రచారం చేస్తున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. దేశ రక్షణ, ప్రజల సంక్షేమంపైనే సైన్యం దృష్టి సారిస్తుందని.. రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని ఆయన పరోక్షంగా సందేశం పంపారు.
మునీర్ ప్రకటన రాకముందే.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసీన్ నఖ్వీ కూడా ఇదే తరహాలో వార్తలను కొట్టిపారేశారు. అసిమ్ మునీర్ నిష్పాక్షికమైన సైనికాధికారి అని, రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటారని వారు నొక్కి చెప్పారు. అయితే పాకిస్థాన్‌లో చరిత్రను పరిశీలిస్తే.. సైన్యం రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించడం, నేరుగా లేదా పరోక్షంగా ప్రభుత్వాలను నియంత్రించడం సర్వసాధారణం. అనేక సార్లు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసి, సైన్యం అధికారాన్ని చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ పదవి దేశంలోనే అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఆ పదవిలో ఉన్నవారు ఏ చిన్న వ్యాఖ్య చేసినా దానికి రాజకీయ ప్రాముఖ్యత ఉంటుంది. అసిమ్ మునీర్ చేసిన ఈ ప్రకటన.. సైన్యం రాజ్యాంగబద్ధ పాలనకే కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య విలువలకు మద్దతు ఇస్తుందని చాటి చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, భద్రతా సవాళ్లపైనే సైన్యం పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ప్రకటన రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను కొంతవరకు తగ్గించగలదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అసిమ్ మునీర్ స్పష్టమైన వైఖరి వల్ల, పాకిస్థాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వంపై పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సమాజంలో విశ్వాసం పెరుగుతుందని కూడా కొందరు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa