ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత స్విమ్మర్ బులా చౌదరీ ఇంట్లో దొంగల బీభత్సం

national |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 07:38 PM

స్విమ్మింగ్ క్వీన్ బులా చౌదరి ఇంట్లో దొంగలు పడ్డారు. అలా అని డబ్బు, నగలు, విలువైన వస్తువులనో దోచుకెళ్లలేదు. ఏకంగా ఆమె జీవితాంతం కష్టపడి సంపాదించిన పతకాలను. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా హిండ్‌మోటార్‌లో ఉన్న బులా చౌదరీ పూర్వీకుల ఇంట్లో జరిగింది. ఈ ఇల్లు కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. అయితే బులా చౌదరీ తన కుటుంబంతో కలిసి కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమె అప్పుడప్పుడు హిండ్‌మోటార్‌లోని ఇంటికి వెళ్లి.. అక్కడ భద్రపరిచిన తన అవార్డులు, పతకాలను చూసుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె సోదరుడు డోలన్ చౌదరీ శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లినప్పుడు ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. వెనుక వైపు ఉన్న గ్రిల్ తాళం పగలగొట్టి.. దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్లు డోలన్ గుర్తించారు.


దొంగలు ఇంట్లో ఉన్న 150కి పైగా పతకాలు, మెమెంటోలను దొంగిలించారు. ఇందులో అత్యంత విలువైన ఆమె పద్మశ్రీ అవార్డు బ్రోచ్‌తో పాటు 10 దక్షిణాసియా సమాఖ్య గేమ్స్ బంగారు పతకాలు ఉన్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న బులా చౌదరీ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. "వారు వారికి ఏమాత్రం విలువ లేని, నాకు ఎంతో అమూల్యమైన వాటిని తీసుకెళ్లారు. 1979లో తొమ్మిదేళ్ల వయసులో నా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి 1995లో రిటైర్ అయ్యే వరకు నేను సంపాదించుకున్నవన్నీ ఈ పతకాలే. అవన్నీ ఇప్పుడు పోయాయి" అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.


దొంగలు కేవలం పతకాలను మాత్రమే కాకుండా.. ఇంట్లోని వాష్‌బేసిన్‌లను ధ్వంసం చేసి అన్ని ట్యాప్‌లను కూడా దొంగిలించారు. అయితే ఇలా బులా చౌదరి ఇంట్లో దొంగతనం జరగడం తొలిసారేమీ కాదు. గతంలోనూ ఆమె ఇంట్లో మూడు సార్లు దొంగలు పడ్డారు. గతంలో 2014లో రెండుసార్లు దొంగతనాలు జరిగాయి. ఆ సమయంలో నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర జ్ఞాపకాలు కూడా దొంగలించారు. ఆ సమయంలోనే ఆమెకు వచ్చిన అర్జున అవార్డు, టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను దొంగలు వదిలేశారని తెలిసింది. బహుశా వాటి విలువ వారికి తెలియకపోవచ్చని బులా అభిప్రాయపడ్డారు.


పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐడీ బృందం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనంలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు విచారణకు అదుపులోకి తీసుకున్నారు. "దొంగలు కేవలం డబ్బు కోసం మెడల్స్ దొంగలించి ఉండవచ్చు, వాటికి వారికి ఎలాంటి ఉపయోగం లేదు. నా జీవితంలో అవి సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో వారికి తెలియదు" అని బులా చౌదరీ ఆవేదన వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa