ఈ ఏడాది దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్ అందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వస్తు, సేవల ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేకూర్చేందుకు జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ఆదివారం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.సుపరిపాలన విస్తరణే తమకు సంస్కరణ అని పేర్కొన్న ప్రధాని, ప్రజల జీవితాలను, వ్యాపారాలను సులభతరం చేసేందుకు రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు రానున్నాయని తెలిపారు. "ఈ ప్రయత్నంలో భాగంగా జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు రాబోతున్నాయి. ఈ దీపావళికి జీఎస్టీ సంస్కరణల రూపంలో పౌరులకు డబుల్ బోనస్ లభిస్తుంది" అని మోదీ అన్నారు.ఈ సంస్కరణలకు సంబంధించిన పూర్తి ఫ్రేమ్‌వర్క్‌ను అన్ని రాష్ట్రాలకు పంపించామని, ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి అన్ని రాష్ట్రాలు సహకరించాలని ప్రధాని కోరారు. మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌కు కీలక ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల స్థానంలో... కేవలం 5 శాతం, 18 శాతం అనే రెండు శ్లాబులను మాత్రమే అమలు చేయాలని ప్రతిపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ కొత్త విధానంలో సామాన్యులు వినియోగించే నిత్యావసరాలు, ఆరోగ్య సంబంధిత వస్తువులు, హస్తకళలు, ఇన్సూరెన్స్ వంటి వాటిపై 5 శాతం పన్ను ఉంటుంది. ఫ్రిజ్, టీవీ వంటి ఇతర తయారీ వస్తువులపై 18 శాతం పన్ను విధిస్తారు. అయితే, సిగరెట్లు, పొగాకు, చక్కెర పానీయాలు, పాన్ మసాలా వంటి లగ్జరీ, హానికర వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధానం యథాతథంగా కొనసాగుతుంది.ఈ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబరులో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పన్నుల హేతుబద్ధీకరణ ద్వారా దేశంలో వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పులు ప్రతి ఇంటికీ, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తాయని, అలాగే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయని ప్రధాని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa