ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ ఆంక్షల దెబ్బ.. ఆస్తులు అమ్మేసుకుంటున్న రష్యా సంస్థ.. భారత్‌పై ప్రభావం

international |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 09:46 PM

అధికారంలోకి వస్తే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. పదవిలోకి వచ్చినప్పటి నుంచి చేయని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. అయితే యుద్ధాన్ని ఆపడం.. తాను అనుకున్నంత సులువు కాదని ఇప్పటికే ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. తన పట్టును మాత్రం వీడటం లేదు. యుద్ధం ఆపేందుకు సామ దాన భేద దండోపాయాలు చేస్తున్న ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త ఆంక్షలు రష్యా చమురు దిగ్గజాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరీముఖ్యంగా దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన లుక్‌ఆయిల్‌ సంస్థ.. తమకు విదేశాల్లో ఉన్న అంతర్జాతీయ ఆస్తులను విక్రయించాలని సంచలన నిర్ణయం తీసుకుంది.


అక్టోబర్ 22వ తేదీన డొనాల్డ్ ట్రంప్ లుక్‌ఆయిల్‌తో పాటు రోస్‌నెఫ్ట్‌ సంస్థలపై ట్రంప్ ఆంక్షలు ప్రకటించిన నేపథ్యంలో.. రష్యా వెలుపల వ్యాపారం చేయడం ఈ సంస్థలకు మరింత కష్టంగా మారింది. దీంతో లుక్‌ఆయిల్‌ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయంగా ఉన్న తన ఆస్తులను విక్రయించే పనిలో ఉన్నట్లు తెలిపింది. ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్న వారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ లావాదేవీలను ఆంక్షల గ్రేస్ పీరియడ్ అయిన నవంబర్ 21వ తేదీ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ గడువులోగా పూర్తి కాని పక్షంలో.. అదనపు సమయం కోరే యోచనలో ఉన్నట్లు కూడా లుక్‌ఆయిల్ సంస్థ తెలిపింది.


రష్యా ప్రభుత్వానికి చమురు, గ్యాస్ ఎగుమతులు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ లుక్‌ఆయిల్, రోస్‌నెఫ్ట్‌ సంస్థలదే కావడం గమనార్హం. లుక్‌ఆయిల్‌కు 11 దేశాలలో చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో వాటాలు ఉన్నాయి. బల్గేరియా, రొమేనియా దేశాల్లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారాలతోపాటు.. నెదర్లాండ్స్‌లోని రిఫైనరీలో 45 శాతం వాటా.. అనేక దేశాల్లో గ్యాస్ స్టేషన్లలో భాగస్వామ్యం ఉన్నాయి. రోస్‌నెఫ్ట్‌కు జర్మనీలోని ష్వెడ్ట్ రిఫైనరీలో వాటా ఉన్నప్పటికీ.. జర్మన్ ప్రభుత్వం ఇప్పటికే దాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ రిఫైనరీ నుంచి ఆదాయం మాతృ సంస్థకు చేరడం లేదు.


భారత్, చైనాపై ప్రభావం


అమెరికా విధించిన ఈ ఆంక్షలు రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాల విక్రయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ ఆంక్షల తర్వాత రష్యా తన చమురు ఎగుమతులను ఆసియా దేశాల వైపు మళ్లించింది. గ్లోబల్‌డేటా టీఎస్ లోంబార్డ్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ షుమితా దేవేశ్వర్ చెప్పిన వివరాల ప్రకారం.. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 60 శాతం వాటా ఈ రెండు కంపెనీలదేని పేర్కొన్నారు.


ఈ నేపథ్యంలో ఆంక్షల చిక్కులు పడకుండా ఉండేందుకు భారతీయ రిఫైనరీలు ఈ కంపెనీల నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ ఇప్పటికే భారత వస్తువుల దిగుమతులపై 25 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించగా.. తాజాగా విధించిన ఈ ఆంక్షలు భారత్‌పై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.


రష్యా స్పందన


ట్రంప్ తీసుకువచ్చిన ఒత్తిడి గురించి ప్రశ్నించగా.. క్రెమ్లిన్ ప్రతినిధి డ్మిట్రీ పెస్కోవ్ స్పందించారు. తమ ఉత్పత్తిని అందిస్తున్నామని.. ఇది చాలా దేశాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిందని.. పోటీతత్వంతో ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు. తమ ఉత్పత్తి ఎంత ఆకర్షణీయంగా ఉందో.. దాంతో ఇతర ప్రత్యామ్నాయాలు ఎంతవరకు పోటీ పడగలవో నిర్ణయించుకోవాల్సింది ఆయా దేశాలేనని తెలిపారు. ట్రంప్ ఆంక్షల కారణంగా.. ఈ రెండు రష్యన్ కంపెనీలతో లావాదేవీలు నిర్వహించే విదేశీ బ్యాంకులకు కూడా సెకండరీ ఆంక్షల ముప్పు ఉండటంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి అవి క్రమంగా వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa