మన శరీరంలో ఒక అద్భుతమైన సైన్యం ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ ఉంటుంది – అదే వ్యాధినిరోధక వ్యవస్థ లేదా ఇమ్యూన్ సిస్టమ్. బయటి నుంచి వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి శత్రువులను గుర్తించి, వెంటనే దాడి చేసి నాశనం చేయడం దీని రోజువారీ పని. ఈ సైనికులు రక్తంలో పరుగులు తీస్తూ, చర్మం నుంచి శ్వాస మార్గాల వరకు ప్రతి సెంటీమీటర్‌ను కాపాడుతారు. ఈ రక్షణ వ్యవస్థ లేకపోతే మనం ఒక్క రోజు కూడా బతకలేం.
కానీ కొన్నిసార్లు ఈ రక్షక సైన్యంలోనే గందరగోళం మొదలవుతుంది. తన సొంత దేశ కణాలనే శత్రువులుగా భ్రమించి దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఉదాహరణకు థైరాయిడ్ గ్రంథి, కీళ్లు, చర్మం, రక్తకణాలు – ఏవైనా మన శరీర భాగాలపైనా ఈ తప్పుడు దాడి జరగొచ్చు. దీన్నే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేదా స్వయం ప్రతిరక్షక వ్యాధులు అంటారు. ఈ పరిస్థితిలో శరీరం తనను తాను నాశనం చేసుకోవడం మొదలుపెడుతుంది.
ఆసక్తికరంగా, ఈ వ్యాధులు పురుషుల కంటే మహిళల్లో దాదాపు 4 రెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువతులు ఎక్కువగా బారిన పడుతున్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, హాషిమోటో థైరాయిడైటిస్, టైప్-1 డయాబెటిస్, మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి 80కి పైగా రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు, పర్యావరణ ప్రభావాలు ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఈ వ్యాధులు ఒక్కసారిగా రావు, క్రమంగా లక్షణాలు పెరుగుతాయి – అలసట, కీళ్ల నొప్పి, జ్వరం, జుట్టు రాలడం, చర్మంపై మచ్చలు వంటివి. ముందుగానే గుర్తిస్తే చికిత్సతో నియంత్రణలో ఉంచొచ్చు, కానీ పూర్తిగా నయం చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు. కాబట్టి మీ శరీరం పంపే చిన్న సిగ్నల్స్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు – ఎందుకంటే మన రక్షకుడు ఒక్కసారి తన గురితప్పితే, జీవితమంతా పోరాటమే అవుతుంది!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa