ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చాలా మంది అప్పులు తీసుకుంటుంటారు. బ్యాంకుల్లో లోన్ల కోసం అప్పులు చేస్తుంటారు. సమయానికి చెల్లిస్తే మంచిదే. కానీ చెల్లించడం కుదరకపోతే పర్యవసనాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికీ ఊళ్లలో.. బ్యాంకులో చిన్న చిన్న అప్పులు కూడా తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వారు ఎందరో. ఇది వేలల్లో, లక్షల్లో ఉంటుందని చెప్పొచ్చు. మరి కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు ఉంటే పరిస్థితి ఏంటంటారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు.. తమ వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించేందుకు వేలు, లక్షల కోట్ల అప్పులు చేస్తూ.. వాటిని తీర్చలేక అప్పుల ఊబిలోనే కూరుకుపోతున్నాయి.
అప్పులు చేయడం పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి లక్ష్యాల్ని చేరుకోవడం కోసమే అయినప్పటికీ.. ఆదాయం ఆశించినంత రాకపోతే.. ఆ అప్పులే సంస్థలకు పెనుభారంగా మారుతున్నాయి. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అప్పులు ఉన్న కంపెనీల గురించి తెలుసుకుందాం. ఇందులో టాప్‌లో ఉన్న కంపెనీ అప్పు.. భారత జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం. టాప్- 10 కంపెనీల్లో చూస్తే 5 కంపెనీలు చైనాకు చెందినవే. అమెరికా నుంచి 3 ఉండగా.. ఫ్రాన్స్, కెనడా నుంచి ఒక్కొక్కటి చొప్పున ఉంది.
అమెరికన్ హోం ఫైనాన్స్ దిగ్గజ సంస్థ ఫ్యాన్నీ మే .. అప్పుల్లో టాప్ కంపెనీగా నిలిచింది. ఈ సంస్థ అప్పు.. భారత్ సహా యూకే, ఫ్రాన్స్ ఇలా అభివృద్ధి చెందిన పలు దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. భారత జీడీపీ ప్రస్తుతం రమారమి 4 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ సంస్థ అప్పు 4.21 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 378 లక్షల కోట్లకుపైనే ఉంటుంది.
>> అమెరికాకే చెందిన ఫ్రెడ్డీ మాక్ కంపెనీ అప్పు 3.34 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. జేపీ మోర్గాన్ ఛేజ్ (అమెరికా) అప్పుడు 496.55 బిలియన్ డాలర్లుగా ఉండగా.. అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా అప్పు 494.86 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ రుణం 479 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన బీఎన్పీ పారిబాస్ అప్పు 473 బిలియన్ డాలర్లు కాగా.. చైనా సంస్థ ICBC రుణ భారం 445 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాత వరుసగా బ్యాంక్ ఆఫ్ చైనా 400 బిలియన్ డాలర్లు, సిటిక్ లిమిటెడ్ (చైనా) 386 బిలియన్ డాలర్లు, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా 377 బిలియన్ డాలర్ల అప్పులతో టాప్-10 లో ఉన్నాయి.
భారత్ విషయానికి వస్తే.. ఇక్కడ మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీగా ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుల్లో కూడా టాప్‌లో ఉంది. సంస్థ బ్యాలెన్స్ షీట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి దీని అప్పు 40.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 3.66 లక్షల కోట్లుగా ఉంది. భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాల్ని ఈ రుణాలు ప్రతిబింబిస్తుంటాయి. నిర్వహణ సరిగా లేకపోతే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa