మన బలం బలగం జగనన్న అంటూ మాజీ మంత్రి ఆర్కేరోజా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నగరి నియోజకవర్గ స్థాయి పార్టీ శ్రేణులతో తన నివాస కార్యాలయంలో ఆమె సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం తలదాచుకునే చెట్టులాంటిదన్నారు. ఆ చెట్టు పటిష్టంగా ఉంటేనే మనందరినీ రక్షించడంతో పాటు మనకు ఫలాలు అందిస్తుందన్నారు. పేదప్రజలకు మంచిచేసే అవకాశం మనకు వస్తుందన్నారు. అందరం జగనన్న కుటుంబ సభ్యులమని ఆయన ఆదేశాలు శిరసావహిస్తూ పాటించడం మన ధర్మమన్నారు. పార్టీ నిర్దేశించే కార్యక్రమం అంటే ఎవరో చెబితే వెళ్లే కార్యక్రమం కాదని అది ప్రతి ఒక్కరు బాధ్యతగా చేపట్టే కార్యక్రమం అనే భావన అందరిలో ఉండాలన్నారు. ఏవైనా సమస్యలుంటే మనలో మనమే పరిష్కరించుకుందామన్నారు. అధికార పార్టీ ఎవరికి అన్యాయం చేసినా వారికి అందరూ అండగా నిలబడి పోరాడాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా మభ్యపెడుతుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలన్నారు. మెడికల్ కళాశాలలను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే పేద విద్యార్థులు ఎంతగానో నష్టపోతారన్నారు. అది స్వచ్చందంగా ప్రజలు చేసిన సంతకాలే చెబుతోందన్నారు. వారి తరపున పోరాటం సాగిస్తామన్నారు. తిరుపతిలో 15వ తేదీన జరిగే ర్యాలీకి అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేసే ప్రతి అన్యాయాన్ని, అరాచకాన్ని, మోసాన్ని ప్రజలకు విశధీకరించి చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ నెల 21న మన నేత జగనన్న జన్మదినాన్ని పండుగలా నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై పార్టీనేతలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, వైస్‌ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ కమిటీ, అనుబంధ కమిటీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa