ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షుగర్ ఉన్నవారు ఈ మూడు పరీక్షలు, తప్పక చేయించుకోవాలి

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 11:57 PM

డయాబెటిస్.. ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇది చాలా నెమ్మదిగా ప్రారంభమమవుతుంది. చాలా మంది తీవ్రమైన సమస్యలు తలెత్తే వరకు తమకు ఈ వ్యాధి ఉందని గ్రహించరు. అయితే, డయాబెటిస్‌ని నిర్లక్ష్యం చేస్తే అది నెమ్మదిగా శరీరాన్ని గుల్ల గుల్ల చేస్తుంది. తెలుసుకునేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇది ఒక జీవనశైలికి సంబంధించిన వ్యాధి. అందుకే సరైన లైఫ్‌స్టైల్ పాటించాలి. ఇక, షుగర్ ఉన్నవారు కొన్ని పరీక్షలు కూడా తప్పుకుండా చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారానే షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇక, ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరా మూడు పరీక్షల్ని సిఫార్స్ చేస్తున్నారు.


డాక్టర్ బ్రిజ్మోహన్ అరోరాకి 24 సంవత్సరాల అనుభవంతో ఈ పరీక్షల్ని సిఫార్స్ చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ పరీక్షల్ని సూచించారు. దీర్ఘకాలిక సమస్యల్ని నివారించడానికి, నాణ్యమైన జీవితాన్ని నిర్వహించడానికి ఇది చాలా ముఖ్యం. ఆ మూడు పరీక్షలేంటి, ఎందుకు షుగర్ పేషంట్లు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


 డయాబెటిస్‌ని ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?


​డయాబెటిస్ చికిత్స ప్రారంభించడానికి కేవలం మూడు రక్త పరీక్షలు సరిపోతాయని డాక్టర్ అరోరా వివరిస్తున్నారు. మీకు డయాబెటిస్ ఉంటే లేదా వచ్చే అవకాశాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన మూడు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. డయాబెటిస్‌ని సకాలంలో గుర్తించాలి. లేదంటే అది చేయాల్సిన డ్యామేజ్‌ని చేసేస్తుంది. డయాబెటిస్ నిర్థారణ అయితే చికిత్స సరైన సమయంలోయ అందుతుంది. లేదంటే మీ అంతర్గత అవయవాల్ని ప్రమాదంలో పడేస్తుంది.


మధుమేహానికి 3 ముఖ్యమైన రక్త పరీక్షలు


​HbA1c: ఇది గత మూడు నెలల్లో రక్తంలో చక్కెర స్థాయిల సగటును నిర్థారిస్తుంది.


FBS (ఫాస్టింగ్ బ్లడ్ షుగర్): ఇది ఖాళీ కడుపుతో చేయించుకోవాల్సిన షుగర్ పరీక్ష. తినకముందు రక్తంలో షుగర్ లెవల్స్ పరీక్షిస్తారు.


PPBS (Post-Prandial Blood Sugar): ఏదైనా తిన్న రెండు గంటల తర్వాత రక్తంలో షుగర్ స్థాయిల్ని చెక్ చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.


ఈ మూడు పరీక్షలు ఏ వైద్యుడైనా సరే డయాబెటిస్‌ను నిర్థారించడానికి.. దాని తీవ్రతను అంచనా వేయడానికి సాయపడతాయి. అంతేకాకుండా డైట్, మెడిసిన్, చికిత్స అందించడానికి సాయపడతాయి.


డయాబెటిస్ ఆలస్యంగా నిర్థారణ చేయడం వల్ల కలిగే నష్టాలు


​డయాబెటిస్‌కు చికిత్స ఆలస్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ అరోరా హెచ్చరిస్తున్నారు. ఆలస్యం ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. ఆలస్యంగా నిర్థారణ చేయడం వల్ల నరాలు (డయాబెటిక్ న్యూరోపతి), కళ్ళు (డయాబెటిక్ రెటినోపతి), కిడ్నీలు, గుండె వంటి వాటికి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు.


ముందుగానే చికిత్స ప్రారంభించడం వల్ల దీర్ఘకాలిక నష్టం జరిగే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. రోగులు డయాబెటిస్‌ను సమర్థవంతగా నిర్వహించడంలో సాయపడుతుంది.


డయాబెటిస్ ఉంటే కనిపించే లక్షణాలు


తరచుగా మూత్రవిసర్జన


విపరీతమైన దాహం


అధిక ఆకలి


అలసట, బలహీనత


అస్పష్టమైన దృష్టి


బరువు తగ్గడం


నెమ్మదిగా గాయాలు మానడం


తిమ్మిర్లు లేదా నొప్పి


తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?


షుగర్ ఉన్నవారు సరైన జీవనశైలి పాటించాలి. అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. తినకూడనవి తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది.


ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. వేయించిన ఆహారాలు, షుగరీ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండండి.


శారీరక శ్రమ తప్పనిసరి. కనీసం రోజుకు ముప్పై నిమిషాలైనా బ్రిస్క్ వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఒత్తిడి నిర్వహణ చాలా ముఖ్యం. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయమం వంటివి లై‌ఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa