ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు రోజులు ఫామ్ హౌస్ అద్దెకు తీసుకొని.. రూ.55 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Crime |  Suryaa Desk  | Published : Sun, Jan 04, 2026, 08:43 PM

మంత్రతంత్రాల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించే ముఠాలు మళ్ళీ తెర మీదకు వచ్చేశారు. దైవ ప్రార్థనలు, పూజలు చేస్తే అద్భుతాలు జరుగుతాయని.. ఉన్న డబ్బు మూడు రెట్లు అవుతుందని నమ్మబలికి ఓ రైతు కుటుంబం నుంచి ఏకంగా 55 లక్షల రూపాయలకు పైగా కాజేసిన ఘటన హనుమకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నకిలీ పూజారులు ఆడిన ఈ నాటకంలో ఒక మధ్యతరగతి రైతు నిలువునా మునిగిపోయాడు.


అసలేం జరిగిందంటే..?


హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనపేటకు చెందిన మట్ల విష్ణు అనే రైతుకు యూనికిచర్ల గ్రామంలో ఒక ఫామ్‌హౌస్ ఉంది. డిసెంబర్ 25వ తేదీన విష్ణు స్నేహితుడు రవి తన మిత్రుల కోసం ఆ ఫామ్‌హౌస్‌ను రెండు రోజుల పాటు అద్దెకు అడిగాడు. స్నేహితుడే కదా అని విష్ణు తాళాలు ఇచ్చాడు. మరుసటి రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్లిన విష్ణుకు అక్కడ వింత దృశ్యం కనిపించింది. ఇద్దరు మహిళలు పూజారుల వేషంలో ఉండగా.. మరో ముగ్గురు వ్యక్తులు అక్కడ పూజలు చేస్తున్నట్లు నటించారు. వారు తమను తాము ప్రదీప్, మంగేష్‌లుగా పరిచయం చేసుకున్నారు. తాము గొప్ప పూజారులమని.. ప్రత్యేక మంత్రతంత్రాలతో ఉన్న డబ్బును మూడు రెట్లు పెంచుతామని విష్ణును నమ్మలబలికారు. అనంతరం తమను హైదరాబాద్‌లో దింపాలని కోరగా.. ఆయన అంగీకరించాడు. ప్రయాణం మధ్యలో కూడా ఆ నకిలీ పూజారులు పూజల్లో పాల్గొనాలని విష్ణును ఒప్పించారు.


నిందితులు విష్ణును ఎంతలా నమ్మించారంటే.. డిసెంబర్ 31న ఒక పెద్ద పూజ చేయాలని.. దానికి భారీగా నగదు అవసరమని చెప్పారు. వారి మాటలు నమ్మిన విష్ణు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి.. ఉన్నవన్నీ పోగేసి రూ. 55,55,555 సిద్ధం చేశాడు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల సమయంలో ఘట్‌కేసర్ నుండి నిందితులు ఫోన్ చేసి.. తమను ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లాలని కోరారు. అక్కడికి వెళ్ళాక విష్ణు తెచ్చిన డబ్బును ఒక బ్యాగులో పెట్టి పూజ గదిలో ఉంచారు. పూజ పూర్తయ్యే వరకు గంట సేపు ఒక గదిలో తలుపులు వేసుకుని ఉండాలని.. బయటకు వస్తే పూజ ఫలితం ఉండదని విష్ణును భయపెట్టారు. అమాయకంగా గదిలోకి వెళ్ళిన విష్ణు గంట తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ నిందితులు కానీ.. డబ్బు ఉన్న బ్యాగ్ కానీ లేవు. అప్పుడు కానీ తాను మోసపోయానని అతనికి అర్థం కాలేదు.


బాధితుడు శనివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ ఎస్సై శ్రీధర్ రావు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవడం బాధాకరమని అన్నారు. కష్టపడకుండా డబ్బు రెట్టింపు అవుతుందంటే అది ముమ్మాటికీ మోసమేనని గ్రహించాలని సూచించారు. తెలియని వ్యక్తులను ఫామ్‌హౌస్‌లు లేదా ఇళ్లలోకి రానివ్వద్దని.. ఎవరైనా మంత్రాల పేరుతో డబ్బు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa