రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను 102 రద్దు చేసిన జగన్ రెడ్డి రాయలసీమకు కట్టప్పగా మిగిలిపోయారని, రాయలసీమ ద్రోహి జగన్ అని సీడాప్ ఛైర్మన్ దీపక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను వెడల్పు చేసి ఎక్కువ నీటి సామర్థ్యంతో సీమ రైతాంగానికి నీరందించాలనే ఆలోచన జగన్ ఐదేళ్ల పాలనలో చేయలేదు. కొత్త రిజర్వాయర్లు కట్టాలి. ఉన్న రిజర్వాయర్లను రిపేరు చేయాలి. దీని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆ పని జగన్ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే జీఓ 365 తెచ్చి 102 ప్రాజెక్టులను రద్దు చేసి రాయలసీమకు, సీమ రైతాంగానికి తీరని ద్రోహం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020లోనే స్టే తెచ్చామని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారని, మరి నాలుగేళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి అబద్ధాలు చెప్పుకుంటూ టీడీపీపై అసత్యాలు చెబుతున్నారని అన్నారు. నాలుగేళ్లు కౌంటర్ దాఖలు చేయలేకపోవడంతో నిజమైన రాయలసీమ ద్రోహులు మీరు కాదా అని నిలదీశారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలన్నదే జగన్ ధ్యేయమని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలు ఒక్క గ్రావిటీలోనే తీసుకోగలమని, కేఆర్ఎంబీ పర్మిషన్ లేదు, కేంద్రం అనుమతిలేదు, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని, ఎందుకు ప్రారంభించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వందలాది కోట్లు దుబారా చేశారని, ఇదంతా జగన్ దోపిడీకి నిదర్శనమని ఆరోపించారు. దోచుకొని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు సృష్టించి రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ది పొందాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని ఆయన అన్నారు. రాయలసీమకు నిజమైన ద్రోహి జగన్ రెడ్డేనని, కట్టప్ప ఎలా వెనుకనుంచి పొడిచాడో ఆ విధంగా రాయలసీమ ప్రజలకు ద్రోహం చేశాడని అన్నారు. ముచ్చుమర్రికి సంబంధించిన 13 పంపులకు కరెంట్ బిల్లులు కూడా జగన్ కట్టలేదని మండిపడ్డారు. అనుమతులు లేకుండానే రాయసీమ ఎత్తిపోతలకు రూ.990 కోట్లు ఎందుకు ఖర్చు చేశావని ప్రశ్నించారు. ఇలాంటి నీతిలేని వారికి ప్రజలు ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు."అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులను కర్ణాటక ప్రభుత్వం కడుతున్నా జగన్ రెడ్డి అడ్డుకోలేదు. కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. అలగనూరు కుంగింది. రూ.36 కోట్లు కేటాయిస్తే పోయేది కానీ జగన్ ఒక్కరూపాయి ఇవ్వలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది చనిపోవడానికి కారణం జగన్. శ్రీశైలం డ్యామ్ రిస్క్‌లో పడే పరిస్థితి వచ్చింది. కొత్తవి కట్టడం కాదు ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోలేదు. హంద్రీనీవాను జగన్ రెడ్డి హయాంలో ఎందుకు ఆధునీకీకరించలేదు" అని విమర్శించారు.సాక్షి పత్రిక, బ్లూ మీడియా, పేటియం బ్యాచ్‌లు చేసే ఫేక్ ప్రచారాలు ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యే ఆస్కారం ఉంది. వైఎస్ వివేకాను చంపి నారాసుర రక్త చరిత్ర అని వారి పత్రికలో వారే వేసుకున్నారు. శ్రీవారి పింక్ డైమెండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు ఉపసంహరించుకున్నారు. 300కు పైగా ఆలయాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఏమీ తెలియనట్లు, మాకు సంబంధం లేనట్లు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిని చంపింది రిలయన్స్ వాళ్లంటూ ప్రచారం చేసి అదే అంబానీ కుమారుడిని ఇంటికి ఆహ్వానించి కౌగిలించుకొని వారి మనిషికి ఎంపీ పదవిని కట్టబెట్టిన చరిత్ర వైసీపీది.వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి, ఇతర 700లకు పైగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర జగన్‌ది. వై నాట్ 175 అనే నినాదంతో నేడు 11 సీట్లకు పరిమితం అయ్యారు. పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయి కర్నాటక వాస్తవ్యుడు జగన్. ఎన్నికలప్పుడు సిద్ధం సిద్ధం అని చెప్పి హోర్డింగ్స్ పెట్టారు. ఆ పార్టీ ప్యాకప్ అయ్యేందుకు సిద్ధమని సందేశమిచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు చేస్తున్నారు. నిజంగా రెడ్ బుక్ ఉంటే అంకుశం సినిమాలో రామిరెడ్డిని నడిరోడ్డుపై అండర్ వేర్ తో ఎలా నడిపించుకొని తీసుకెళ్లారో అలా కొడాలి నానిని నడిపించేవాళ్లం. అలాంటి కక్ష రాజకీయాలు లేవని రుజువైంది. ఇంటి ముందు ఏ చిన్న అలికిడి వచ్చినా కొడాలి నాని భయపడిపోతున్నాడు. నేడు కొడాలి నాని పరిస్థితి కోడికి ఈకలు పీకేసినట్లైంది. అది లోకేశ్ పవర్" అని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు మహర్దశ పట్టిస్తామని అన్నారు. తుంగభద్రకు రూ.58 కోట్లు, అలగనూరుకు రూ.36 కోట్లు, గోరకల్లుకు రూ.54 కోట్లు, శ్రీశైలంకు రూ.203 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రూ.3870 కోట్లు ఖర్చు చేసి 738 కి.మీ. హంద్రీనీవా పనులు పూర్తి చేసి కృష్ణా నీరు పారే విధంగా పనులు చేశామని అన్నారు. కుప్పం వరకు కృష్ణా నీటిని అందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కుప్పంలో జగన్ రెడ్డి సినిమా సెట్టింగ్ వేసి డ్రామా చేశాడని, అనంతరం సాయంత్రానికే ఎత్తేశారని ఎద్దేవా చేశారు. రూ.12 లక్షల కోట్ల బడ్జెట్ లో జగన్ కేవలం రూ.2 వేల కోట్లు రాయలసీమకు ఖర్చు చేశాడని ఆరోపించారు.రూ.7 లక్షల కోట్ల బడ్జెట్ లో టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని, ఈ 18 నెలల్లోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు.రోజాను సినిమా వాళ్లు పంపించేశారు, టీవీ వాళ్లు వద్దన్నారు. రోజాకు ఏ పని లేక రోడ్లపైకి వచ్చి మాట్లాడుతుంది. వైసీపీ నేతలకు దమ్ముంటే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలి. కూటమి ప్రభుత్వంలో రూ.20 వేల కోట్లు ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. ఇది సీమ ప్రజలకు తెలుసు. వైసీపీ సైకో బ్యాచ్, అవినీతి పత్రికలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోవాలి అని దీపక్ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa