పెద్ద పండుగ వచ్చేసింది. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యుల మధ్యన ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. పట్టణం మొత్తం పల్లె వైపు అడుగులు వేస్తోంది. రోజూ ఉరుకుల పరుగుల జీవితం, మెట్రో ప్రయాణాలకు అలవాటు పడిన సిటీ వాసి.. కొన్నిరోజులు పల్లెలో పిండి వంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, కోడిపందేల మధ్య ఛిల్ అయ్యేందుకు సిద్ధమైపోయాడు. ఇక సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ మహానగరం దాదాపు సగం ఖాళీ అయ్యే పరిస్థితి. పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన జనం.. పెద్దపండుగ కోసం సొంతూర్లకు బయల్దేరుతుంటారు. ఇలా వెళ్లేవారితో బస్టాండులు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతుంటాయి.
ఇక సంక్రాంతికి ఊరెళ్లేవారి కోసం ఆర్టీసీలు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తుంటాయి. ప్రత్యేక రైలు సర్వీసులు నడుస్తున్నప్పటికీ కూడా.. సీట్లు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ ఆర్టీసీ, అటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తూ ఉంటాయి. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా కోస్తా జిల్లాలకు ఎక్కువ మంది వెళ్తుంటారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ మధ్య ఎక్కువగా ప్రత్యేక బస్ సర్వీసులు నడిపిస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ప్రత్యేక బస్సులు సగటు మధ్య తరగతి జీవికి షాకివ్వనున్నాయి.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. మొత్తం 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపింది. సంక్రాంతి పండుగకు ముందు రోజులతోపాటుగా.. తిరుగు ప్రయాణానికి కూడా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేదీ నుంచి 10, 12, 13వ తేదీలలో.. అలాగే తిరుగు ప్రయాణం కోసం జనవరి 18, 19 తేదీల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండులతో పాటుగా ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, బోయిన్‌పల్లి నుంచి నడపనున్నారు. అయితే ఈ ప్రత్యేక బస్సులలో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రెగ్యులర్ సర్వీసులలో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది.
మరోవైపు సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. సాధారణ సర్వీసులకు అదనంగా 8432 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అయితే ప్రత్యేక బస్సులలో 71 శాతం రాష్ట్రంలోనే నడిపించనుంది. ఆరు వేల బస్సులను రాష్ట్రంలోనే నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. హైదరబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు 2432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ.. పండుగ ముందు రోజుల కంటే తిరుగు ప్రయాణాలకే ఎక్కువ బస్సు సర్వీసులను కేటాయించింది.
సంక్రాంతి పండగకు ముందు ఏపీఎస్ఆర్టీసీ 3857 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఇందులో 3500 బస్సులు ఏపీలోనే రాకపోకలు సాగిస్తాయి. ఇతర ప్రాంతాలకు కేవలం 357 ప్రత్యేక బస్సులను కేటాయించగా.. అందులో హైదరాబాద్‌కు కేటాయించిన ప్రత్యేక బస్సులు కేవలం 240. బెంగళూరుకు 102, చెన్నైకు 15 బస్సు సర్వీసులు నడిపించనున్నారు. అయితే తిరుగు ప్రయాణానికి మాత్రం ఏపీఎస్ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. తిరుగు ప్రయాణం కోసం 4 వేల 575 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. ఇందులో హైదరాబాద్ నగరానికి మాత్రమే 1800 ప్రత్యేక బస్సులు కేటాయించడం విశేషం. బెంగళూరుకు 200, చెన్నై వెళ్లడానికి 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాకపోకలు సాగించేందుకు 2500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీలే వసూలు చేయనుంది. రెగ్యులర్ బస్ సర్వీసుల మాదిరిగానే ఛార్జీలు ఉంటాయని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో 50 శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పండుగకు ఊరెళ్లాలని అనుకునే వారు ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు వెళ్దామంటే హైదరాబాద్ నుంచి కేవలం 240 ప్రత్యేక బస్సులు మాత్రమే ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణానికి మాత్రం 1800 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సంక్రాంతి పండుగకు ముందు హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. టీజీఎస్ఆర్టీసీలో అదనపు ఛార్జీలు, ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల మోత, ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వెళ్లేవారికి ఈ సంక్రాంతికి జేబుకు ఛిల్లు ఖాయమని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa