ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముసుగులతో వస్తే నగలు అమ్మబోం.. ఆభరణాల దుకాణాల నిర్ణయంపై తీవ్ర దుమారం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 08:23 PM

వరుసగా బంగారం షాపుల్లో జరుగుతోన్న చోరీలను అరికట్టడానికి ఆభరణాల వర్తక సంఘం తీసుకున్న నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారానికి తెరతీసింది. ముఖాలు కనిపించకుండా మాస్క్‌లు, హిజాబ్‌, హెల్మెట్‌ వంటి వాటిని ధరించే కస్టమర్లకు నగలను చూపించరాదని, విక్రయించరాదని బిహార్ ఆభరణాల వర్తక సంఘం నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఈ మేరకు ఆల్‌ ఇండియా జ్యుయలర్స్ అండ్‌ గోల్డ్‌స్మిత్‌ ఫెడరేషన్‌ ప్రకటన చేసింది. ముఖాలకు కప్పుకుని వచ్చేవారిని గుర్తించడం సాధ్యంకాదని, ఏదైనా చోరీ జరిగితే సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో గుర్తించేందుకు తమ సంఘం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.


‘‘ముఖాలు కప్పుకుని వచ్చే కస్టమర్లకు నగలు విక్రయించకూడదని నిర్ణయించాం.. హిజాబ్‌, మాస్క్, హెల్మెట్‌ వంటి వాటిని పెట్టుకుని తమ ముఖాలు కనిపించకుండా షోరూమ్‌లకు వచ్చే వారికి విలువైన వజ్రాలు, ఆభరణాలను చూపించం. కస్టమర్లు, నగల దుకాణం యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఏఐజేజీఎఫ్‌ బిహార్ విభాగం ప్రెసిడెంట్ అశోక్‌ కుమార్‌ వర్మ వెల్లడించారు. దుకాణంలోని సిబ్బంది ఎవరూ బలవంతంగా వారి హిజాబ్, బుర్ఖా, మాస్క్‌లు తొలగించరని, మేము కేవలం మర్యాదపూర్వకంగా అభ్యర్థిస్తామని వర్మ పేర్కొన్నారు.


ముఖాలకు ముసుగులతో షాపుల్లోకి ప్రవేశించి దోపిడీలు, చోరీలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఇదే తరహాలో గతేడాది మార్చిలో భోజ్‌పుర్‌ జిల్లాలోని ఓ దుకాణంలో రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను చోరీ చేశారు. అలాగే, నవంబర్‌లోనూ సివాన్‌ నగరంలో ఇటువంటి ఘటన జరిగిన విషయాన్ని స్థానిక వ్యాపారులు గుర్తుచేశారు.


అయితే, వర్తక సంఘం నిర్ణయం రాజకీయ విమర్శలకు దారితీసింది. ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇది రాజ్యాంగ విరుద్దమని, మతస్వేచ్ఛపై దాడిచేయడమేనని ఆరోపించింది. ఆర్జేడీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. మతపరమైన మనోభావాలను కించపరచడమే కాదు, రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛపై దాడిచేయడమే అని అన్నారు. ఈ ఎజెండా వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఉన్నాయని, నగల వర్తకుల సంఘం తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది భార రాజ్యాంగం, లౌకిక స్వరూపాన్ని బలహీనపరుస్తుందని ఇజాజ్ హెచ్చరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa