ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారం కోసం కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు..రాజకీయాల్లో అనూహ్య పరిణామం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 08:25 PM

రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయనేది నానుడి. రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌లు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా చేతులు కలిపాయి. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంబర్‌నాథ్‌ మున్సిపల్ మేయర్‌ ఎన్నిక కోసం కమలం, హస్తం ఒక్కటై.. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఝలక్ ఇచ్చాయి. షిండే నేతృత్వంలోని శివసేనకు మేయర్ పదవి దక్కకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సహకారం బీజేపీ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడి’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశాయి.


ఈ కూటమి నుంచి బీజేపీ కౌన్సిలర్ తేజశ్రీ కరంజులే మేయర్‌గా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో సేన (షిండే వర్గం) అతిపెద్ద పార్టీగా అవతరించినా.. బీజేపీ రాజకీయ ఎత్తుగడతో అధికారం దక్కకుండా పోయింది. ఈ అనూహ్య పరిణామం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. బీజేపీ నుంచి 14 మంది, 12 మంది కాంగ్రెస్, నలుగురు ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), ఒక స్వతంత్ర కౌన్సిలర్ కలిపి కొత్త కూటమి బలం 32కు చేరింది. దీంతో బీజేపీకి కౌన్సిల్‌లో స్పష్టమైన మెజారిటీ లభించింది.


కానీ, ఈ పొత్తును మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అంబర్‌నాథ్ బ్లాక్ చీఫ్ ప్రదీప్ పాటిల్‌తో పాటు, కాంగ్రెస్ తరపున గెలిచిన కార్పొరేటర్లందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ‘ఇది పూర్తిగా తప్పుడు చర్య.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమే" అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ అన్నారు. అలాగే, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ పొత్తు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ‘ఎవరైనా స్థానిక నేత సొంతంగా అలాంటి నిర్ణయం తీసుకుంటే, అది క్రమశిక్షణకు విరుద్ధం. అలాంటి పొత్తు ఏర్పడితే, దానిని రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశాం’ అని ఆయన తెలిపారు.


ఈ పరిణామాలపై షిండే సేన తీవ్రంగా స్పందించింది. ‘కాంగ్రెస్-ముక్త భారత్’ నినాదాన్ని బలంగా వినిపించే బీజేపీ, ఆ పార్టీతో చేతులు కలపడం అనైతికమని మండిపడింది. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధమైన, అనైతిక కూటమిగా శివసేన నాయకులు విమర్శించారు. అధికారం కోసం బీజేపీ తన సిద్ధాంతాలను పక్కన పెట్టిందని ఆరోపించారు. ఇది పూర్తిగా వెన్నుపోటు రాజకీయమేనని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికార్ దుయ్యబట్టారు.


స్థానిక బీజేపీ నేతలు మాత్రం అభివృద్ధి, సుపరిపాలన కోసమే ఈ పొత్తు పెట్టుకున్నామని సమర్థించుకోవడం గమనార్హం. అంబర్‌నాథ్‌ను భయం, అవినీతి లేని నగరంగా మార్చడమే తమ లక్ష్యమని, శివసేన (షిండే వర్గం) పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. ఆ పార్టీతో పొత్తుకు ప్రయత్నించినా స్పందన రాకపోవడంతోనే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.


ఇదిలా ఉండగా, అంబర్‌నాథ్ ఎపిసోడ్, మహాయుతి కూటమిలోని అంతర్గత విభేదాలను బయటపెట్టింది. బీజేపీ-కాంగ్రెస్ పొత్తు స్థానిక రాజకీయాల్లో అధికారాన్ని నిర్ణయించినా, బీజేపీ, శివసేన (షిండే వర్గం) మధ్య అంతరాన్ని పెంచింది. ఈ పరిణామాలు భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు, ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa