ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ఏకంగా 20 లక్షల మందికి పంపిణీ

national |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 08:29 PM

తమిళనాడు ప్రభుత్వం కళాశాల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఉలగం ఉంగల్ కైయిల్ (ప్రపంచం మీ చేతుల్లో) పేరుతో ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు. మొదటి దశలో 10 లక్షల మందికి ఈ ప్రయోజనం కలుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగనుండగా.. అంతకుముందే డీఎంకే ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి కీలక చర్యలు చేపట్టింది.


తమిళనాడు ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించడానికి ఈ ఉలగం ఉంగల్ కైయిల్ కార్యక్రమాన్ని చేపట్టింది. రెండు దశల్లో కలిపి మొత్తం 20 లక్షల ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మొదటి దశలో 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు కేటాయించింది.


ఎవరికి ఇస్తారు?


ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద ల్యాప్‌టాప్‌లు అందుకోనున్నారు. ఇందులో ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్, లా, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు అందరూ అర్హులు. ముఖ్యంగా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.


ల్యాప్‌టాప్ ఫీచర్లు


డెల్, ఏసర్, హెచ్‌పీ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు ఇస్తున్నారు. ఇవి Intel i3/AMD Ryzen 3 ప్రాసెసర్, 8GB RAM, 256GB SSD, Windows 11 వంటి అత్యాధునిక ఫీచర్లతో వస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌తో పాటు విద్యార్థులకు Perplexity Pro AI ప్లాట్‌ఫారమ్ 6 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.


ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


ఈ ఉలగం ఉంగల్ కైయిల్ పథకానికి విద్యార్థులు ఆన్‌లైన్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సంబంధిత కాలేజీలు, యూనివర్సిటీలే అర్హులైన విద్యార్థుల జాబితాను సిద్ధం చేస్తాయి. విద్యార్థుల అకడమిక్ రికార్డులు, ఇతర వివరాలను ELCOT (Electronics Corporation of Tamil Nadu) ద్వారా ప్రభుత్వం ధృవీకరిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు వారి కళాశాలల ద్వారానే ల్యాప్‌టాప్‌లను అందజేస్తారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa