ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్.. ఆ ఎన్నికల కోసం అందరికీ షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 08:58 PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడిని మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి నిజం చేశాయి. జాతీయ స్థాయిలో ఉప్పు, నిప్పులా ఉండే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్థానిక అధికారం కోసం అనూహ్యంగా చేతులు కలిపాయి. అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్ ఎన్నికలో చోటుచేసుకున్న ఈ వింత పొత్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేనను నిలువరించడమే లక్ష్యంగా బద్ధశత్రువులు ఏకమవ్వడం గమనార్హం.


తేజశ్రీ కరంజులే విజయకేతనం..


అంబర్‌నాథ్ మేయర్ పీఠం కోసం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో బీజేపీ అభ్యర్థి తేజశ్రీ కరంజులే ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ఆమెకు మొత్తం 32 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. ఈ సంఖ్యా బలంలో 16 మంది బీజేపీ సభ్యులు ఉండగా.. వారికి మద్దతుగా 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు నిలవడం విశేషం. వీరితో పాటు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కూడా ఓటు వేయడంతో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోగలిగింది. సొంత కూటమిలోని పార్టీల మధ్య ఉండాల్సిన సమన్వయం దెబ్బతినడం, ప్రత్యర్థి పార్టీల కలయిక శివసేనను ఆత్మరక్షణలో పడేశాయి.


శివసేన ఆగ్రహం..


మేయర్ పదవి కోసం కాంగ్రెస్‌తో బీజేపీ జతకట్టడంపై శిందే వర్గం శివసేన తీవ్రంగా మండిపడింది. నిత్యం కాంగ్రెస్ సిద్ధాంతాలను విమర్శించే బీజేపీ.. ఇప్పుడు అధికారం కోసం అదే పార్టీతో అపవిత్ర పొత్తు పెట్టుకుందని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికార్ ధ్వజమెత్తారు. ఇది తమ వెన్నుపోటు పొడవడమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షంగా ఉంటూ స్థానిక స్థాయిలో ప్రత్యర్థులతో చేతులు కలపడం రాజకీయం కాదని విమర్శించారు.


శివసేన చేస్తున్న విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్ కరంజుల్ పాటిల్ తోసిపుచ్చారు. అంబర్‌ నాథ్‌లో శివసేనతో పొత్తు పెట్టుకోవడానికి తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కానీ వారి నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని ఆయన స్పష్టం చేశారు. అందుకే స్థానిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇదే క్రమంలో శిందే పార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబర్‌నాథ్‌లో శివసేన నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, వారి అరాచకాలను అరికట్టడానికే ఈ అరుదైన కూటమి ఏర్పడిందని వెల్లడించారు. కొన్ని వారాల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు ఈ పొత్తుతో తెరపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa