ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సర్. ప్లీజ్. మిమ్మల్ని కలవచ్చా అని మోదీ అడిగారు ?’.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Wed, Jan 07, 2026, 09:14 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో తయారైన అపాచీ హెలికాప్టర్ల డెలివరీకి సంబంధించి భారత ప్రధాని తనతో నేరుగా ఒక సమస్యను ప్రస్తావించారని, తనను ‘సర్’ అని సంబోధించారని తెలిపారు. ‘అంటే భారత్ నా దగ్గరకు వచ్చింది, సర్. నేను ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాను.. మేము దానిని మారుస్తున్నాం’ అని రక్షణ ఉత్పత్తులు, విదేశాలకు సైనిక సామాగ్రి విక్రయాల గురించి అధికారులతో జరిగిన చర్చలో ట్రంప్ వ్యాఖ్యానించారు.


హౌస్ GOP మెంబర్ రిట్రీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. భారతదేశం సంవత్సరాల క్రితం తాము ఆర్డర్ చేసిన అపాచీలను ముందుగానే డెలివరీ చేయమని తనను సంప్రదించిందని అన్నారు. ‘భారత్ 68 అపాచీలను ఆర్డర్ చేసింది.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నన్ను కలవడానికి వచ్చారు. సర్. దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా? అని అన్నారు.. అవును’ అని ఆయన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఇదే సమయంలో తాము మించి మిత్రులమని, తనకు ‘అతనితో (మోదీ) చాలా మంచి స్నేహం’ ఉందని కూడా ఆయన అన్నారు.


వాణిజ్య విధానం కారణంగా తమ మధ్య సంబంధం దెబ్బతిన్నట్లు ట్రంప్ అంగీకరించారు. ‘వారు ఇప్పుడు చాలా మొత్తంలో సుంకాలు చెల్లిస్తున్నారని మీకు తెలుసు కాబట్టి ఆయన (మోదీ) నాతో అంతగా సంతోషంగా లేరు’ అని ఆయన అన్నారు. ‘కానీ ఇప్పుడు వారు (భారతదేశం) రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం గణనీయంగా తగ్గించారు’ అని ట్రంప్ అన్నారు.


రష్యా నుంచి చమురు దిగుమతులను సాకుగా చూపి భారత్‌పై అమెరికా మొత్తం 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా చమురు దిగుమతులపై అమెరికా ఆందోళనలను పరిష్కరించకపోతే భారత్ వస్తువులపై సుంకాలను మరింత పెంచుతామని ట్రంప్ హెచ్చరికలు చేసిన మర్నాడే ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇక, సుంకాల విధింపు నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు సమర్దించుకున్నారు. భారీగా టారీఫ్‌లతో అమెరికా ఆర్థికంగా ప్రయోజనం పొందుతుందని ఆయన చెప్పారు.


అలాగే, రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు అమెరికా సైన్యానికి, విదేశీ కొనుగోలుదార్లకు అందజేయడంలో జరుగుతోన్న జాప్యంపై ట్రంప్ ప్రస్తావించారు. ‘‘ ఎఫ్-35 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు తయారీకి ఎక్కువ సమయం పడుతోంది.. రక్షణ కాంట్రాక్ట్‌లు పొందిన పరిశ్రమలు తయారీ వేగవంతం చేయాలి’ అని ట్రంప్ సూచించారు.


రిపబ్లికన్ సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ.. మిత్రదేశాలు, భాగస్వాములకు కూడా ఆయుధాలను వేగంగా అందించాలని అమెరికా రక్షణ కంపెనీలను తన యంత్రాంగం ఒత్తిడి చేస్తోందని అన్నారు. గత దశాబ్ద కాలంలో అమెరికా రక్షణ పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేసిన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది, వాషింగ్టన్‌తో క్రమంగా విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా రవాణా విమానాలు, హెలికాప్టర్లు, నిఘా వ్యవస్థలను కొనుగోలు చేసింది. అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం, వైమానిక దళ ఆధునీకరణ ప్రణాళికలలో కీలక భాగం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa