ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీకి బంగ్లాదేశ్ మరో లేఖ, ఇదే ఆఖరి ప్రయత్నం

sports |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 11:01 PM

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో బంగ్లాదేశ్–ఐసీసీ మధ్య వివాదం మరింత ముదిరింది. భారత్‌లో జరగనున్న తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని పట్టుబడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీకి మరోసారి లేఖ రాసింది. ఈసారి తమ డిమాండ్‌ను ఐసీసీకి చెందిన స్వతంత్ర కమిటీకి అప్పగించాలని కోరింది.


భారత్‌లో ఆడబోమన్న నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని బీసీబీ స్పష్టం చేసింది. అలా చెప్పిన కొద్ది గంటలకే ఐసీసీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలను పరిశీలించే స్వతంత్ర న్యాయవాదులతో కూడిన ఈ కమిటీ జోక్యం చేసుకుంటే తమ వాదనకు న్యాయం జరుగుతుందనే ఆశలో బీసీబీ ఉంది.


బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు రెండూ ఈ నిర్ణయం పూర్తిగా భద్రతా కారణాలతోనే తీసుకున్నామని మరోసారి స్పష్టం చేశాయి. ఢాకాలో సీనియర్ ఆటగాళ్లతో సమావేశం అనంతరం క్రీడల సలహాదారుడు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ భారత్‌కు వెళ్లే నిర్ణయాన్ని మార్చే అవకాశం లేదన్నారు. ఐసీసీ తమ అభ్యర్థనను పట్టించుకోలేదని, అందుకే వరల్డ్ కప్‌లో పాల్గొనడం అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను భద్రతా కారణాలతో భారత్ నుంచి పంపించేశారన్న సంఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు.


ఇదివరకే జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదిక మార్పు అభ్యర్థనను తిరస్కరించింది. టోర్నీలో పాల్గొనే 20 దేశాలకు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, స్వతంత్ర భద్రతా నివేదికల్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని తేలిందని ఐసీసీ స్పష్టం చేసింది. షెడ్యూల్ మార్చితే ఇతర జట్లు, అభిమానులకు పెద్ద ఇబ్బందులు కలుగుతాయని కూడా ఐసీసీ పేర్కొంది.


వరల్డ్ కప్‌లో గ్రూప్ సీలో ఉన్న బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్‌తో తలపడాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మొదటి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, చివరి మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.


ఈ వివాదానికి అసలు కారణం ముస్తఫిజూర్ రహ్మాన్‌కు సంబంధించిన అంశమేనని బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ వెల్లడించారు. ఐపీఎల్‌లో భద్రతా కారణాలతో ముస్తఫిజూర్‌ను జట్టు నుంచి తప్పించారన్న విషయం తమకు పెద్ద హెచ్చరికగా మారిందన్నారు. ఆ వెంటనే ఐసీసీని సంప్రదించి సమస్య తీవ్రతను వివరించామని చెప్పారు. వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్న వేళ, స్వతంత్ర కమిటీతో విచారణ కోరడం ఇప్పుడు కీలకంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa