దేశీయ ట్యాక్సీ సేవల రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో రూపొందించిన 'భారత్ టాక్సీ' సేవలు గురువారం రోజే అధికారికంగా ప్రారంభం అయ్యాయి. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ వినూత్న యాప్‌ను లాంచ్ చేశారు. 'సహకార్ సే సమృద్ధి' అనే నినాదంతో.. డ్రైవర్లే యజమానులుగా సాగే ఈ సరికొత్త ప్రయాణం ప్రయాణికులకు కూడా ఎంతో ఊరటనివ్వనుంది.
డ్రైవరే యజమాని..
'భారత్ టాక్సీ' అనేది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు.. ఇది 'సహకర్ టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్' ద్వారా నడిచే ఒక సహకార వ్యవస్థ. అముల్ విజయ గాథను స్ఫూర్తిగా తీసుకుని.. ఐఎఫ్ఎఫ్సీఓ, నాఫెడ్ వంటి దిగ్గజ సహకార సంస్థల భాగస్వామ్యంతో దీనిని రూపొందించారు. ఈ ప్లాట్ఫామ్లో చేరే ప్రతి డ్రైవర్‌ను 'సారథి' అని పిలుస్తారు. ప్రతి సారథికి ఈ సహకార సంస్థలో ఐదు షేర్లు ఉంటాయి. అంటే డ్రైవర్లు కేవలం పని చేసేవారే కాదు. సంస్థలో భాగస్వాములు కూడా.
ప్రస్తుతం ఓలా, ఉబెర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి. కానీ 'భారత్ టాక్సీ'లో ఎలాంటి కమిషన్ ఉండదు. డ్రైవర్లు యాప్‌ను వాడుకున్నందుకు రోజుకు కేవలం 30 రూపాయల నామినల్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం డ్రైవర్ జేబుకే వెళ్తుంది. దీనివల్ల డ్రైవర్ల ఆదాయం పెరగడమే కాకుండా ప్రయాణికులకు కూడా సాధారణ ధరల కంటే 30 శాతం తక్కువకే రైడ్స్ లభించే అవకాశం ఉంటుంది.
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట
ప్రయాణికుల భద్రత కోసం భారత్ టాక్సీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. డ్రైవర్లు అందరినీ ఢిల్లీ పోలీసుల ద్వారా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఢిల్లీ పోలీసుల సహకారంతో మొత్తంగా 35 ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ అలర్ట్స్, లైవ్ రైడ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..
గత డిసెంబర్ నుంచి ఢిల్లీ, గుజరాత్లో జరిగిన ప్రయోగాత్మక పరిశీలనలో ఈ యాప్ అద్భుతమైన ఫలితాలను సాధించింది. రోజుకు సగటున 10,000 రైడ్స్‌ను పూర్తి చేస్తూ.. సుమారు 3 లక్షల మంది డ్రైవర్లు ఇప్పటికే ఈ ప్లాట్ఫామ్లో చేరారు. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలకు ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ భారత్ ట్యాక్సీతో ఉబర్, ఓలా వంటి సంస్థలకు బ్రేక్ పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa