కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధ్వజమెత్తారు. స్థానికంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన కూటమి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి స్థానిక ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కూటమి నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కుల, మత వివాదాలు చోటుచేసుకుంటే వాటికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కూటమి నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని నివేదికలు వస్తున్నప్పటికీ, కూటమి నాయకులు దివర్సన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టిడిపి పరిశీలకులు కనుపర్తి శ్రీనివాసరావును ఉద్దేశించి మాట్లాడుతూ, “నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది ఎవరూ లేరు. అరుపులు, కేకలు వేసి ప్రెస్‌మీట్లు పెడితే దడిచే వాళ్లు ఎవరూ లేరు. ఇది గుంటూరు కాదు, దివిసీమ” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారని, ప్రజల తరపున వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa