ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షల కోసం మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేస్తారు. వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. సెల్‌ఫోన్ల ద్వారా ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి షేర్ చేయకుండా అన్ని పరీక్ష కేంద్రాలను అధికారులు ‘నో ఫోన్ జోన్లు’గా ప్రకటించారు. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. పోలీస్‌స్టేషన్ల నుంచి తెచ్చిన ప్రశ్నపత్రాల బండిళ్లను సీసీ కెమెరాల ముందే విప్పి వాటిని విద్యార్థులకు అందిస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి మీడియాకు కూడా అనుమతి లేదు. పరీక్షల విధుల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐడీ కార్డులను కలిగి ఉండాలి.