ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించింది. 2022, 2023 సంవత్సరాలకు ఈఏపీసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. ఉన్నత విద్యా మండలి ఆదేశాలతో ఇంటర్ బోర్డు ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్‌లో ఉన్న సమయంలో కోవిడ్ వల్ల మార్చిలో పరీక్షలను ప్రభుత్వం నిర్వహించలేదు. విద్యార్థులందరినీ పాస్ అయినట్లు ప్రకటించారు. అయితే విద్యార్థులకు ఎక్కువ మార్కులు కావాలంటే సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
దీంతో చాలా మంది విద్యార్థులు మెరుగైన మార్కుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. కొందరు విద్యార్థులు పరీక్షలు రాయకపోవచ్చని ఇంటర్ బోర్డు ఆలోచించింది. దీంతో ఎవరూ నష్టపోకుండా ఈఏపీ సెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఈఏపీ సెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా వల్ల ఇంటర్ సిలబస్‌లో 30 శాతం పాఠాలను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈఏపీ సెట్‌లోనూ అందుకు అనుగుణంగానే ప్రశ్నలు ఇవ్వనున్నారు.