వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో వెలసివున్న శ్రీ మానసా దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు చల్లా వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సంతానం లేని వారికి సంతానమిచ్చే శ్రీ మానసాదేవి అమ్మవారిపై అక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం. ప్రతి ఏటా వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.
గణపతి పూజ, పుణ్యాహవాచనం, నవగ్రహ మండపారాధన, మూల విరాట్ కు, ఉత్సవమూర్తులకు నవగ్రహములకు మహా స్నాపనము, పంచామృతాభిషేకం, మంగళ హారతి, తీర్థ ప్రసాదాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు గురుగోవింద శాస్త్రి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చల్లా వంశస్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.