రాష్ట్రంలో కొల్లేరు తరువాత రెండో అతి పెద్ద మంచినీటి సరస్సు కొండకర్ల ఆవ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, మునగపాక మండలాల మధ్య గల కొండకర్ల ఆవలో అనేక రకాల చేపలు, జంతువులు ఉన్నాయి. అయితే ప్రపంచంలో అంతరించేపోయే జాబితాలో వున్న ఏటి కుక్కలు (ఓటీటీఈఆర్‌ఎస్-ఆటర్స్ కొండకర్ల ఆవలో వున్నట్టు విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్టు కన్జర్వేషన్ టీమ్ గుర్తించింది. ఈ సంస్థ కొండకర్ల ఆవతోపాటు ఉత్తరాంధ్రలో మరికొన్ని ప్రాంతాల్లో నివసించే జంతువులపై అధ్యయనం చేస్తోంది. పాదముద్రలు, విసర్జించిన మలం ఆధారంగా ఈ సంస్థ కొండకర్లఆవలో ఏటికుక్కల ఆనవాళ్లను పసిగట్టింది.
రెండు, మూడుచోట్ల 'కెమెరా ట్రాప్స్'ను అమర్చి, అందులో నిక్షిప్తమైన చిత్రాల ఆధారంగా ఏటికుక్కలు వున్నట్టు నిర్ధారించింది. నిరంతరం నీటి లభ్యత, చుట్టూ పొదలు, గట్లు వుండడంతో కొండకర్లఆవలో ఏటికుక్కలు వున్నట్టు తేల్చింది. అయితే ఏటి కుక్కల సంఖ్య ఎంత అనేది ఇంకా నిర్ధారించలేదు. పూర్తిగా అధ్యయనం చేయాలంటే మరిన్ని కెమెరా ట్రాప్స్‌తోపాటు ఆవలో తిరగడానికి బోటు, ఇతర సాంకేతిక సరంజామా అవసరమని ఈ సంస్థ చెబుతోంది.
కొండకర్లఆవలో ఏటికుక్కలున్న విషయాన్ని ఐయూసీఎన్/ఎస్‌ఎస్‌సీ ఆటర్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. చేపలు, పాములు, చిన్న పిట్టలే ఆహారం. ఏటికుక్కలు ముంగిసను పోలి ఉంటాయి. ముంగిస కంటే కొంచెం పెద్దవిగా వుండే ఇవి నీటిలో జీవిస్తూ చేపలు, పాములు, నీటిపై ఎగిరే చిన్న పిట్టలను వేటాడుతుంటాయి. నీటిలో ఎక్కువసేపు వుండేలా వీటి శరీర నిర్మాణం ఉంటుంది. బయటకు వస్తే గట్లకు బొరియలు చేసుకుని ఉంటాయి. ఇంకా పొదలు, రెల్లిగడ్డి పొదల్లో జీవిస్తాయి.
అయితే ఎక్కువగా చేపలు తినే ఏటికుక్కలను మత్స్యకారులు శత్రువుగా పరిగణిస్తారు. సరస్సులు, నదుల్లో చేపల వేట కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బాక్సులతో కూడిన ట్రాప్స్‌ను ఈ ఏటి కుక్కలు ధ్వంసం చేసి లోపల చేపలను తినేస్తుంటాయి. దీంతో గోదావరి, కృష్ణా డెల్టాలో ఏటికుక్కలను చంపేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో అంతరించిపోయే జాతుల జాబితాలో వున్న ఏటికుక్కలను చంపినా, వేటాడిన వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏటికుక్కలపై విస్తృత అధ్యయనం అవసరం ఉదని శ్రీచక్రప్రణవ్, ఈస్టుకోస్టు కన్జర్వేషన్ టీమ్ ప్రతినిధి అన్నారు.