సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి అత్యంత మహిమాన్వితుడని రాష్ర్ట గవర్నర్ భిష్వభూషణ్ హరిచందన్ అన్నారు. వరాహా, నారసింహ అవతారాలుతో కూడిన ఆ సింహాద్రినాధుడిని దర్శించుకోవడం భక్తులంతా తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారన్నారు. ఇటీవలే తాను కూడా సింహాచలం క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామిని దర్శించుకోవడం జరిగిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ హరిచందన్ ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనుబాబు సింహాద్రినాధుడి చందనోత్సవం విశిష్టతను తెలియజేస్తూ అప్పన్న చందనం ప్రసాదాన్ని అందజేశారు. శేష వస్త్రం సమర్పించారు. అంతేకాకుండా ఆలయ చరిత్రను విపులంగా తెలియజేసే అంశాలుతో పాటు శ్రీ సింహాద్రినారసింహ స్ర్తోత్రమంజరి పుస్తకాలను శ్రీనుబాబు దంపతులు గవర్నర్ కు బహుకరించారు. సింహాద్రినాధుడి జ్ఞాపికను అందజేశారు. వరహా నరసింహ, చందనోత్సవం, నిజరూపం. నిత్య రూపం విశిష్ఠతను విపులము గా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచలం గ్రామంలో జన్మించడం తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నామన్నారు.
అయితే రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పన్న క్షేత్ర మహత్యంకు సంబంధించి మరింత ప్రచారం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. భక్తుల్లో మరింతగా ఆధ్యాత్మిక భక్తిభావాలు పెంపొందించే విధంగా తమ ధర్మకర్తల మండలి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇటీవల ఆలయానికి భక్తులు తాకిడి ఘననీయంగా పెరిగిందన్నారు. గవర్నర్ ను కలిసి సింహాద్రినాధుడి చందనం ప్రసాదం , శేషవస్ర్తం, జ్ఞాపిక అందజేయడం సంతోషం కలిగించిందన్నారు.