గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమవడంతో వేలాది మంది నిరుద్యోగులు ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు సకాలంలో హాజరుకాలేకపోయారు. సోమవారం సాయంత్రం ఒడిసా రాజధాని భువనేశ్వర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో సింగిల్‌లైన్‌లోనే రైళ్ల రాకపోకలు కొనసాగాయి. దీనివల్ల మంగళవారం రైల్వేబోర్డు నిర్వహించిన పరీక్ష రాసేందుకు బయలుదేరిన అనేకమంది అభ్యర్థులు మధ్యలోనే చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా రైల్వే జోన్ల పరిధిలో లక్ష వరకు గ్రూప్-డి పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌సీ-2019 కింద నోటిఫికేషన్ జారీ కాగా, కొవిడ్ నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో భువనేశ్వర్ కేంద్రంగా మంగళవారం ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సిఉండగా, అభ్యర్థులు ఉదయం 8 గంటలకే భువనేశ్వర్, బరంపురంలోని కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంది. తిరుపతి-భువనేశ్వర్, తిరుపతి-భువనేశ్వర్ వీక్లీ, హీరాకుడ్, ఈస్ట్‌కో్‌స్టతో పాటు రెండు ప్రత్యేక రైళ్లల్లో అభ్యర్థులు బయలుదేరి మధ్యలోనే ఇరుక్కుపోయారు. దీంతో అనేక మంది ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. కాగా, కొందరు పలాస, ఇచ్ఛాపురం, కంచిలి రైల్వేస్టేషన్లలో దిగి రోడ్డుమార్గంలో బరంపురం వరకు వెళ్లి పరీక్షలు రాసినట్టు తెలిసింది.