శారీరక ఆరోగ్యాన్నీ దృఢత్వాన్నీ ఇచ్చే బీట్‌రూట్‌ను తరచుగా తినాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. మహిళల్లో కనిపించే పోషకాహార లోపం, జుట్టు రాలిపోవడం, త్వరగా అలసిపోవడం లేదా నీరసించడం లాంటి అనేక సమస్యలకు బీట్‌రూట్ ఔషధంలా పనిచేస్తుంది. నెలసరి సమయంలో చాలామంది అమ్మాయిలు ఐరన్ తగ్గి బాధపడుతుంటారు. బీట్‌రూట్‌లో ఇది సమృద్ధిగా ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం, జింక్, కాపర్ తదితరాలు అమ్మాయిలకు మంచి పోషకాహారం అని చెప్పవచ్చు.తగినంత బరువుతో ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు బీట్‌రూట్ తరచుగా తింటుండాలి. బీట్‌రూట్ మెదడుతో సహా శరీర భాగాలన్నిటికీ రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులోని పొటాషియం జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. కాళ్లనొప్పులూ, బలహీనత రాకుండా చేస్తుంది. శరీరానికి పుష్టినిచ్చి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది. వ్యాయామం చేసే మహిళలు రోజుకు రెండు కప్పులు బీట్ రూట్ రసాన్ని తాగితే మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నందున కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. హృద్రోగాలతో బాధపడుతున్నవారు తమ ఆహారంలో బీట్‌రూట్ ఉండేలా చూసుకోవడం మంచిది. జ్యూస్ రూపంలో తాగలేమనుకున్నవారు కూర లేదా హల్వా రూపంలో చేసుకు తినొచ్చు.