టీటీడీ పలు వినూత్న నిర్ణయాలను తీసుకొంటోంది. తాజాగా తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉదయం 10 గంటలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తారు.
అలాగే ఇదే నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాలను భక్తులు గుర్తించి.. ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. టీటీడీ ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లు.. https://ttdsevaonline.com లో చేసుకోవచ్చు.
ఇటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్ బయటకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 35,506 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.