కుప్పం నియోజకవర్గం లో టిడిపి, వైసిపి నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ముగించుకుని వెళ్లిన అరగంటలోనే పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు. శాంతిపురం మండలంలో మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, పిఎస్ మణిలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్ జాకీర్ కూడా అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు పర్యటనలో పాల్గొన్న వారిపై దాదాపు 60 మందిపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. తన కుప్పం పర్యటన ముగిసిన వెంటనే మొదలైన అరెస్ట్‌లు మొదలయ్యాయని.. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు చంద్రబాబు.
తన కుప్పం పర్యటనలో వైఎస్సార్‌సీపీ అలజడి సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. పోలీసులే మఫ్టీలో వచ్చి టీడీపీ వారిపై దాడులు చేశారని.. పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామన్నారు. ప్రైవేటు కేసులు పెడితే వారిని కాపాడడానికి ఎవరు రారని.. టీడీపీ కార్యకర్తల పై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను వదిలేది లేదన్నారు. ఆత్మరక్షణ విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం క్యాడర్‌కు లేదన్నారు. పిల్లిని కూడా రూంలో పెట్టి కొడితే పులి అవుతుందన్నారు. ఆ పులే వారిని మింగేస్తుందన్నారు.
ఒకవేళ చూసుకుందాం అంటే తాను సిద్ధమని.. ఎక్కడికి రమ్మంటారు అంటూ చంద్రబాబు సవాల్ చేశారు. కేసులతో జైలుకు వెళ్ళిన కార్యకర్తలను హీరోల్లా తీసుకు వస్తామని.. స్వాతంత్ర సమరయోధుల్లా వారిని సన్మానిస్తామన్నారు. ఇప్పుడు కూడా ఒక 40-50 మందిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని.. వారికి సమాధానం చెప్పాలి అంటే మా ఆడబిడ్డలు చాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇంటి దగ్గర 500 మంది పోలీసులను పెట్టారని.. ఇదేమన్నా ఇండియా పాకిస్తాన్ వివాదమా.. అధికారం లోకి వచ్చిన వెంటనే కుప్పంలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.