ఒక జాతి పురోగమన మార్గాన్ని ముందుండి నడిపించేది తల్లిభాష. తెలుగును వాడుకభాషగా సామాన్యులకు చేరువ చేసేందుకు ఆనాడు పెద్ద పోరాటమే చేసారు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్న మనం...ఇప్పుడు తెలుగును కాపాడుకునేందుకు ఇంకా పెద్ద ఉద్యమం చేయాలి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి 2018 లో ఏపీ తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధను ఏర్పాటుచేశాం. అటువంటిది ఏపీ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం మాయమవుతుందని వింటుంటే బాధగా ఉంది.
ఒక రాష్ట్రం నుంచి ఇలా పూర్తిగా మాతృభాష బోధనాభాషగా మాయం కావడమనేది దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలో భాషా ప్రాతిపదికగా ఏర్పడిన తొలి రాష్ట్రంలో ఇలా జరగడం ఇంకా దురదృష్టకరం. తెలుగు అకాడెమీని తెలుగు, సంస్కృత అకాడమీగా పేరు మార్చాక రూ.63 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయన్న వార్త తప్ప... ఆ సంస్థ తెలుగు భాష కోసం ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియదు. అలాగే తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్ధ కూడా. గిడుగు రామ్మూర్తి పంతులుగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తూ... తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని కాపాడుకునేందుకు మనందరం పునరంకితమవుదాం అని పిలుపునిచ్చారు.