ఉరుములతో కూడిన భారీ వర్షం కారణంగా పిడుగు పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో కనిగిరెడ్డి నరసింహులు ఆయన భార్య పద్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం నరసింహులు ఆయన భార్య పద్మ తమ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నరసింహులు ఆయన భార్య పద్మ వ్యవసాయ పనులు చేస్తున్న సమీపంలో హఠాత్తుగా పిడుగు పడింది. పిడుగు ధాటికి నరసింహులు, ఆయన భార్య పద్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరసింహులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోతనాపల్లి గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన కారణంగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.