నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి శ్రీకాకుళం పాత బస్టాండ్ కు ఆర్టీసీ బస్సులు నడపాలని స్థానికులు కోరుతున్నారు. కాంప్లెక్స్ వద్ద పలువురు ఆదివారం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆర్టీసీ, పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గతంలో పాతబస్టాండు బస్సులు ఉండేవని, రెండేళ్లుగా బస్సులు నడపటం లేదని బ్రహ్మ కృష్ణ చారి, శిల్లా మనోహర్, ముద్దాడ కోటేశ్వరరావు, సారిపల్లి గోవిందరావు అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కాంప్లెక్స్కు నేరుగా బస్సులు ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, చార్జీలు అధికం అవుతున్నాయన్నారు. కార్యాలయాలు అన్నీ పాతబస్టాండ్ వైపే ఉన్నాయని, ప్రధాన వ్యాపార సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గతంలో శ్రీకాకుళం టౌన్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని, పోలీసు అధికారులే పాతబస్టాండ్ సర్వీసులు నిలిపి వేయించారని ఆర్టీసీ అధికారులు అంటున్నారన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం టౌన్ లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అయిందని దీంతో నరసన్నపేట నుంచి పాతబస్టాండ్కు బస్సులు నడపాలని విన్నవించారు.