జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైనట్లు మంత్రి మేరుగ నాగార్జున వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో ఏడాదికి ఇంతమందికే ఇవ్వాలన్న పరిమితి లేదని స్పష్టంచేశారు.
అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా అల్పాదాయం కలిగిన అగ్రవర్ణాల వారికి కూడా విదేశీ విద్య దీవెన అందుబాటులోకి తెస్తూ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు.
ఈ పథకానికి జ్ఞానభూమి పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. రూ.8 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందడానికి అర్హులని స్పష్టం చేశారు.