చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. వి.సాయిధనుష్(నాని)(23) అనే ఓ బ్యాంకులో కాంట్రాక్ట్ బేస్ పద్ధతిలో ఉద్యోగం చేస్తూ, తన తండ్రి వెంకటరమణతో కలసి రాయగడ రోడ్డు శివారు వివేకనందకాలనీలో నివసించేవారు. ఈ మధ్యకాలంలో కొత్తవలస ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈ సమయంలో కొందరి నుంచి అప్పులు తీసుకున్నారు. వాటిని తీర్చాలని సదరు వ్యక్తులు అడగటంతో మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంట్లో ఉన్న తలకు రాసుకునే రసాయనాలు కలిపిన నూనెను తాగాడు. ఆ సయయంలో తండ్రి ఫోన్ చేయగా.. తాను ఇక ఉండటం లేదని బదులివ్వడంతో ఇంటికి వెళ్లిన వెంకటరమణ అపస్మారకస్థితిలో ఉన్న కుమారుడిని చూసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా మృతి చెందాడు.